Hyderabad Girl Injured: ఆఫీసుకు వెళ్లిన అమ్మను ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రితో కలిసి బైకుపై వెళ్తున్న ఓ ఐదేళ్ల పాపకి అనుకోని ప్రమాదం జరిగింది. చైనా మాంజా దారం పాప గొంతును కోసేసి తీవ్ర గాయాలపాలైంది. బండి నడుపుతున్న తండ్రి ముక్కును కూడా కోసింది. వీరిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పాప తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్ వనస్థలిపురం సమీపంలోని కమలానగర్ లో నివసించే వినయ్ కుమార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతని భార్య స్నేహలత కూడా ఉద్యోగం చేస్తోంది. వీరికి ఐదున్నరేళ్ల వయసున్న పాప కీర్తి కూడా ఉంది. శుక్రవారం సాయంత్రం భార్యను ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి పికప్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే తన పాపను కూడా వెంట తీసుకెళ్లాడు. ఇద్దరూ బైకుపై ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ రూట్లో వెళ్లారు. నాగోల్ వంతెనపై వారు ప్రయాణిస్తుండగా... ఎగురుతున్న గాలి పటానికి ఉన్న చైనా మాంజా పక్కన ఉన్న కరెంటు స్తంభానికి చిక్కుకొ ఉంది. దాన్ని గమనించిన వినయ్‌ బైక్‌ పోనిచ్చాడు. బైకుపై ముందు కూర్చున్న చిన్నారి మెడకు కోసుకుపోయింది. లోతుగా గాయమైంది. తండ్రి విషయం గుర్తించే లోపు వినయ్ కుమార్ ముక్కును కూడా ఆ మాంజా దారం కోసేసింది. 


కీర్తి మెడ నుంచి తీవ్ర రక్తస్రావం అవడంతో స్థానికులంతా పరిగెత్తుకొచ్చారు. తండ్రీకూతుళ్లిద్దరినీ... సమీపంలోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం చింతల్ కుంట రెయిన్ బో ఆస్పత్రిలో చేర్పించారు. పాపకు శనివారం శస్త్ర చికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. తమకిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యేందుకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వినయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. వినయ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


గతేడాది కూడా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే..


పతంగులు ఎగరేయటం అందరికీ సరదానే. కానీ ఈ సరదా విషాదంగా ముగిసిన సందర్భాలెన్నో ఉన్నాయి. కైట్స్ ఎగరేస్తూ బిల్డింగ్‌ల నుంచి చిన్నారులు పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. కొందరు తీవ్ర గాయాల పాలై జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితం అవాల్సిన దుస్థితినీ ఎదుర్కొన్నారు. పతంగులు ఎగరేయటానికి వినియోగించే మాంజా దారమూ ప్రాణాలు తీసింది. ఈ దారం వాడకూడదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పట్టించుకోవటం లేదు. ఒక్కోసారి ఇది చెట్లకు, ట్రాన్స్‌ఫార్మర్లకు, కరెంట్ పోల్స్‌కు చిక్కుకుని గాలికి కింద పడిపోతుంటాయి. ఇవే ప్రమాదం కొని తెస్తుంటాయి. దిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. వాయువ్య దిల్లీలోని మౌర్య ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా, దారం చుట్టుకుని మృతి చెందాడు. హైదర్‌పూర్ ఫ్లైఓవర్‌పై వేగంగా వెళ్తున్న సుమిత్ రంగ మెడకు పతంగి ఎగరేసే దారం గట్టిగా చుట్టుకుంది. గొంతు పూర్తిగా కోసుకుపోయింది. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాధితుడు మృతి చెందాడు. బురారీ నుంచి వెళ్తుండగా, ఓ దారం వచ్చి తన కొడుకు మెడకు గట్టిగా చుట్టుకుందని, అందుకే మృతి చెందాడని మృతుడి తండ్రి చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.