Hyderabad Drugs Case : హైదరాబాద్‌ బంజారాహిల్స్(Banjara Hills Drugs Case) ఫుడింగ్ పబ్ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. మాజీ ఎంపీ రేణుకా చౌదరి(Former MP Renuka Chowdhury) అల్లుడు కిరణ్‌ రాజ్‌(Kiran Raj)ను ఈ కేసులో నిందితుడిగా పోలీసులు చేర్చారు. డ్రగ్స్ కేసులో కిరణ్ రాజ్‌ని ఏ4గా చేర్చారు. ఈ కేసులో ఏ1గా అనిల్, ఏ2 అభిషేక్, ఏ3 అర్జున్ ఉన్నారు. వీరిలో అనిల్, అభిషేక్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. మిగిలిన వారికోసం పోలీసుల గాలిస్తున్నారు. శనివారం రాత్రి పోలీసుల సోదాల్లో దొరికిన వాళ్లలో ఆరుగురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.


మాజీ మంత్రి అల్లుడు కూడా 


బంజారాహిల్స్ పబ్ లో డ్రగ్స్ దొరికిన కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టైన అనిల్, అభిషేక్ ను పోలీసులు నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నిందితులను చంచల్‌గూడ జైలుకి తరలించారు. పరారీలో ఉన్న అర్జున్‌, కిరణ్ రాజ్ ల కోసం రెండు టీమ్ లను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. మరో వైపు ఈ కేసులో కిరణ్ రాజ్ ను పోలీసులు ఏ4గా చేర్చారు. కిరణ్ రాజ్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అల్లుడని సమాచారం. ఈ కేసులో కీలక అంశాలు తెలియాల్సి ఉందని నిందితులు ఇద్దరిని పోలీసుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు. గతంలో ఇలాంటి పార్టీలు నిర్వహించారా అనే కోణంలో విచారణ చేసేందుకు నిందితులను కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది.


పబ్ లో రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల 


ఈ పబ్ పార్టీలో దొరికిపోయి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన వారిలో గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌‌తో పాటు, నటి నిహారిక కొణిదెల ప్రధానంగా కనిపించారు. వీరు కాక, తెలంగాణకు చెందిన ఓ మాజీ ఎంపీ కుమారుడు, ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు, ఒక మాజీ డీజీ స్థాయి అధికారి కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పోలీసులే తమ రక్షణలో ఉంచి బయటకు పంపినట్లు తెలిసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ లోపలికి మీడియాను అనుమతించలేదు. లోపల ఉన్నవారు మీడియా కంటబడతామనే ఉద్దేశంతో అనుమతించనట్లుగా తెలిసింది. పట్టుబడ్డ 150 మందిలో చాలా మంది వీకెండ్ పార్టీ కోసమే వచ్చినా, వారిలో చాలా తక్కువ మంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారు ఉన్నారు. ఆకస్మిక దాడుల్లో డ్రగ్స్ కూడా దొరకడంతో ఆ సమయంలో ఉన్న అందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరు మత్తు మందులు వాడారన్నది కచ్చితంగా నిర్ధారణ కాలేదు. వాటిని సరఫరా చేసిన వారు దొరకడంతో ఎవరి కోసం తెచ్చారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఎవరి పేర్లు చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.