Hyderabad News : న్యాయం చేయాలంటూ ఓ యువతి అత్తింటి ముందు ధర్నా చేస్తుంది. భర్త, అత్త, మామ వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. హైదరాబాద్ అశోక్ నగర్ లో భర్త ఇంటి ముందు బాధిత యువతి నిరసన చేస్తుంది. ఏలూరుకి చెందిన గౌరీకి హైదరాబాద్ అశోక్ నగర్ కి చెందిన శ్రీ కృష్ణతో 2019లో వివాహం జరిగింది. మూడు సంవత్సరాలుగా అత్తమామలు వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. భర్తను తన నుంచి దూరం చేసి వేరే ఇంటికి పంపించారని గౌరీ ఆవేదన చెందుతున్నారు. నాలుగు నెలలుగా భర్త తన వద్దకు రాకుండా అడ్డుకుని అత్తమామలు వేధిస్తున్నారన్నారు. గురువారం ఉదయం తనను ఇంటి నుంచి బయటికి పంపించి లగేజీ బయటపడేశారని గౌరీ ఆరోపిస్తున్నారు. అత్తమామలు తాను ఇంట్లో ఉండకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారన్నారు. తన భర్తతో కలిసి ఉండేలా తనకు న్యాయం చేయాలంటూ బాధిత యువతి గౌరీ ఆవేదన చెందుతున్నారు. 


పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య 


భార్యభర్తల మధ్య గొడవలు ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆవేశంలో తాను చనిపోవడమే కాకుండా అభంశుభం తెలియని చిన్నారులను తనతో పాటు తీసుకువెళ్లిపోయింది. తెలంగాణలోని మేడ్చల్​ లో ఈ విషాదం ఘటన జరిగింది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడింది. అదృష్టవశాత్తు పెద్ద కొడుకు బతికి బయటపడ్డాడు. ఇద్దరు పిల్లలు, తల్లి మరణించారు. తాను లేకపోతే చిన్నారుల భవిష్యత్ ఏమవుతుందో అనే భయంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని బంధువులు చెబుతున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె బంధువులు తెలిపారు. స్థానికంగా ఉన్న చెరువులో పిల్లలతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోగా, ఐదేళ్ల పెద్ద కుమారుడు బతికి బయటపడ్డాడు.


భార్యభర్తల మధ్య మనస్పర్థలు 


మేడ్చల్ మండలం రాజబొల్లారానికి చెందిన బ్రహ్మణపల్లి భిక్షపతి ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. అదే మండలంలో నూతన్ కల్ గ్రామానికి చెందిన శివరాణితో ఆరేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు పిల్లలు జగదీష్(5), దీక్షిత్(3), ప్రణీత(1) ఉన్నారు. కొద్ది నెలలు క్రితం భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం వారి మధ్య మాటామాటా పెరిగి ఆవేశంలో భర్త పనికి వెళ్లిన తరువాత తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద కుమారుడు జగదీష్ ను అంగన్ వాడీ కేంద్రానికి తీసుకెళ్తున్నానని తీసుకుని ఇంట్లోంచి వెళ్లింది. రాత్రి 10 గంటల వరకు వదిన ఇంటికి రాకపోవడంతో మరిది రమేష్ తన సోదరుడికి సమాచారం ఇచ్చాడు. ఇద్దరు కలిసి చుట్టుపక్కల ఆరా తీశారు. శివరాణి చెరువు పక్కన కనిపించిందని స్థానికులు చెప్పడంతో అక్కడిగి వెళ్లి గాలిస్తే అక్కడ పెద్ద కుమారుడు జగదీష్ చెరువు గట్టుపై ఏడుస్తూ కన్పించడంతో ఏం జరిగిందో ఆరా తీశారు. ముగ్గురి మృతదేహాలను చెరువులోంచి బయటికి తీశారు. విషయం తెలుసుకున్న మహిళ బంధువులు భిక్షపతిని చితకబాదారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేశారు.