Eluru Chemical Factory Accident : ఏలూరు జిల్లా అంకిరెడ్డిగూడెం అగ్నిప్రమాదం దురదృష్టకరమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. విజయవాడ ఆసుపత్రిలో బాధితులను ఆమె పరామర్శించారు. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో ఘటనస్థలిలోనే ఐదుగురు చనిపోయారని ఆమె తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు, ఫ్యాక్టరీ నుంచి రూ.25 లక్షలు మొత్తం రూ.50 లక్షల పరిహారం అందిస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని మంత్రి అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరామన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు. 


రూ.50 లక్షల పరిహారం 


"కంపెనీ స్థాపించి దాదాపుగా 18 ఏళ్లు అవుతోంది. యజమాన్యానిది తప్పని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. 50 లక్షల పరిహారం ఇస్తున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దారుణం. ప్రమాదకర కంపెనీలపై గత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వంలో ఎప్పుడు ప్రమాదాలు జరగలేదా. అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం." అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. 


బాధితులకు పరామర్శ 


ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ లో జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన క్షతగాత్రులను హోం మంత్రి తానేటి వనిత, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు విజయవాడ గొల్లపూడి ఆంధ్ర హాస్పటల్ లో పరామర్శించారు. 


అసలేం జరిగిందంటే?


బుధవారం అర్ధరాత్రి ఏలూరు జిల్లా నూజివీడు దగ్గర్లోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో యూనిట్‌-4లో రియాక్టర్ పేలి మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన 13 మందిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఐదుగురు బీహార్‌కు చెందిన వారే ఉన్నారు. ఈ ప్రమాదంలో 5 మంది సజీవ దహనం అయ్యారు. పోరస్ రసాయన పరిశ్రమలో అర్ధరాత్రి జరిగినందున కెమికల్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదాలకు నిలయంగా మారుతున్న కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కెమికల్ ఫ్యాక్టరీ వల్ల చాలా కాలుష్యం బయటికి వస్తోందని, దాని కోరల్లో గ్రామంలో ప్రజలు చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుండి తొలగించాలని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫ్యాక్టరీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్థానికుల ఆందోళనతో దిగొచ్చిన జిల్లా యంత్రాంగం ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విచారణ నిమిత్తం లోపల సిబ్బంది ఉన్నారే తప్ప ప్రస్తుతానికి ఫ్యాక్టరీలో ఎలాంటి కార్యకలాపాలు జరగడం  లేదన్నారు అధికారులు.