Hyderabad Crime News: హైదరాబాద్ నగరంలో క్రిప్టో కరెన్సీ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. భాగ్యనగరంలో తాజాగా వెలుగు చూస్తున్న మోసాల్లో సైబర్ మోసాలు అధికంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడిందో కంపెనీ యాజమాన్యం. ఎక్స్ సీఎస్పీఎల్ అనే కంపెనీ.. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. 90 రోజుల్లో 4 లక్షలు ఇస్తామంటూ ఆశ చూపింది. ఆపై చాలా మంది అమాయక ప్రజల నుంచి లక్షల్లో దోచేశారు. 90 రోజుల్లోపెట్టుబడి డబ్బులకు 4 శాతం ఎక్కువ ఇస్తామని చెప్పడంతో వందలాది మంది డబ్బులు చెల్లించారు. ఇందులో చాలా మంది అప్పులు చేసి, లోన్ తీసుకొని, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించి మోసపోయారు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే మంజీరా మాల్ లోని 11వ అంతస్తులో ఈ కంపెనీ ఉండగా.. ప్రస్తుతం మూసేసి ఉంది. డబ్బులు తీసుకున్న యాజమాన్యం చెప్పా పెట్టకుండా పారిపోయింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితులకు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్బీనగర్ లో మరో కేసు - ఉద్యోగాలిప్పిస్తామని కోట్లు కాజేసిన దంపతులు
తాజాగా సైబర్ క్రైమ్ బాదితులను పట్టించుకోకుండా పోలీసులు, అధికారులు నిందితులకు సపోర్ట్ చేస్తున్నారని మానవ హక్కుల సంగాన్ని ఆశ్రయించారు పలువురు బాధితులు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన చెంద్రశేఖర్, సుమ దంపతులు. వీరిద్దరూ... నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతూ ఉంటారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బెంగుళూరులో టీసీఎస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తూ అందినకాడికి దండుకుంటారు. ఆపై ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి మొహం చాటేస్తారు. అయితే ఆన్ లైన్ ద్వారా ఇలా మాయ మాటలు చెప్తూ లక్షలు కాజేస్తున్న ఈ జంట.. ఇప్పటి వరకు పలువురు నిరుద్యోగ యువతీ యువకుల నుంచి 40 లక్షల వరకు దోచేశారు. అయితే తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.
నిందితులతో చేతులు కలిపిన పోలీసులు..
హెచ్ఆర్సీ కంటే ముందే బాధితులు ఎల్బీనగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే వారు తమను పట్టించుకోకుండా.. నిందితులతో కుమ్మకై తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాము హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని.. తమ డబ్బులు తమకు తిరిగి వచ్చేలా చేయమని అధికారులను వేడుకుంటున్నారు. అలాగే బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసులే నిందితులకు వత్తాసు పలకడం సరికాదని, ఈ కేసులో ఎల్బీ నగర్ పోలీసులను కూడా విచారించాలని కోరారు.
గతేడాది నవంబర్ లోనూ ఇలాంటి ఘటనే...!
హైదరాబాద్ గాంధీ నగర్ కు చెందిన శ్రీనివాస్ ఫోన్ నెంబర్ ను గుర్తు తెలియని వ్యక్తులు టెలిగ్రామ్ గ్రూపులో యాడ్ చేశారు. తాము చెప్పినట్లు చేస్తే తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావొచ్చంటూ వల విసిరారు. ఏం చేయాలంటూ అడిగిన పాపానికి శ్రీనివాస్ ను నిండా ముంచేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడ్తే.. చాలా లాభాలు వస్తాయని, తక్కువ సమయంలోనే కోటీశ్వరులు అవ్వొచని చెప్పారు. దీంతో 10, 20, 80 వేలు పెట్టుకుంటూ పోయాడు శ్రీనివాస్. ఆ తర్వాత ఒకేసారి 2 లక్షల 50 వేలు పెట్టాడు. దీనికి లాభాలు కనిపించాయి. తీసుకునేందుకు వీలు లేకుండా డబ్బును సైబర్ నేరగాళ్లు ఫ్రీజ్ చేశారు. లాభాలు వస్తున్నాయి కదా అని అత్యాశకు పోయి పలు దఫాలుగా 27 లక్షల రూపాయలను పెట్టాడు. అయితే అందులోంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఏం చేయాలో పాలుపోక వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ ను కలిసి జరిగిన విషయమంతా వివరించాడు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.