SBI Credit Card Charges Hike: దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదార్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ రోజుల్లో, ఒక్కో కస్టమర్‌ చేతిలో కనీసం రెండు బ్యాంకుల క్రెడిట్‌ కార్డులు ఉంటున్నాయి. ఆన్‌లైన్‌ & ఆఫ్‌లైన్‌ షాపింగ్‌ ఖర్చులు సహా చాలా రకాల బిల్లుల చెల్లింపు కోసం క్రెడిట్ కార్డ్‌లను ప్రజలు ఉపయోగిస్తున్నారు. క్రెడిట్‌ కార్డుల ద్వారా నెలనెలా రెంట్లు కూడా కడుతున్నారు. చేతిలో డబ్బు లేని సమయంలో క్రెడిట్‌ కార్డు ద్వారా అద్దె చెల్లించి, డబ్బు సర్దుబాటు అయ్యాక తిరిగి క్రెడిట్‌ కార్డ్ బిల్లు చెల్లిస్తున్నారు. ఈ విధానం చాలా మంది కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంది. 


బిల్లుల చెల్లింపుల్లో భాగంగా... ఫోన్‌ పే (PhonePe), క్రెడ్‌ (CRED), పేజాప్‌ (Payzapp), పేటీఎం (Paytm), రెడ్‌ జిరాఫీ ‍‌(Red Giraffe), నో బ్రోకర్‌ (No Broker) వంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌ల ద్వారా, మీ దగ్గరనున్న క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి సులభంగా ఇంటి అద్దె (Rent payment) చెల్లించవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు కన్వీనియన్స్ ఫీజును కట్టి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.


క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చేసే రెంట్‌ పేమెంట్ల మీద బ్యాంకులు మొదట్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదు. ఈ పద్ధతికి జనం అలవాటు పడ్డాక ఛార్జీల బాదుడు మొదలు పెట్టాయి. 


ఫీజు పెంచిన ఎస్‌బీఐ
క్రెడిట్‌ కార్డు (Credit Card) ఉపయోగించి అద్దె చెల్లిస్తే, దాని మీద (ఇప్పటికే ఉన్న) ఛార్జీ పెంచుతున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ (SBI Cards) ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ ఛార్జీ (ప్రాసెసింగ్‌ ఫీజు) రూ. 99 గా ఉంది. దీనిని మరో రూ. 100 పెంచి, రూ. 199 కి చేర్చింది. 2023 మార్చి 17 నుంచి కొత్త ఛార్జీని వసూలు చేస్తుంది. పైగా, ఈ ప్రాసెసింగ్‌ ఫీజు మీద అదనంగా GSTని కూడా వినియోగదారు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్‌ కార్డ్‌ ఉపయోగించి అద్దె చెల్లిస్తే వర్తించే కొత్త ఛార్జీల గురించి వినియోగదార్లకు ఎస్‌బీఐ కార్డ్స్‌ సందేశాలు పంపిస్తోంది. 


2022 నవంబర్‌ 14 వరకు, ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి అద్దె చెల్లించే వెసులుబాటు ఉంది. 2022 నవంబర్‌ 15 నుంచి దానిని రూ. 99 + GST గా ఎస్‌బీఐ కార్డ్స్‌ మార్చింది. 2023 మార్చి 16వ తేదీ వరకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. మార్చి 17వ తేదీ నుంచి కొత్త ప్రాసెసింగ్‌ ఫీజును వినియోగదార్లు చెల్లించాలి.


ఈ లిస్ట్‌లో మరికొన్ని బ్యాంకులు
క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపు చేస్తే అదనపు ఛార్జీని విధించాలని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ (IDFC Fist Bank) కూడా నిర్ణయించింది. ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చెల్లించిన అద్దె మీద 1% రుసుము (Fees) చెల్లించాల్సి ఉంటుంది. దీనికి వస్తు, సేవల పన్ను (GST) అదనం. ఈ నిబంధన మార్చి 3, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం, తన క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి అద్దె చెల్లింపు చేస్తే, ఆ లావాదేవీ మీద ఎలాంటి ఛార్జీని IDFC ఫస్ట్ బ్యాంక్ వసూలు చేయట్లేదు. 


క్రెడిట్‌ కార్డ్ ద్వారా చేసే అద్దె చెల్లింపు మీద అదనపు బాదుడును బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి తీసుకు వచ్చింది.


ICICI బ్యాంక్ కూడా ఛార్జీల మోత మోగిస్తోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లిస్తున్న వాళ్ల నుంచి 1% ప్రాసెసింగ్‌ ఫీజు, దీని మీద GST వసూలు చేస్తోంది. అక్టోబర్ 20, 2022 నుంచి దీనిని అమల్లోకి తెచ్చింది.