Hyderabad Crime News: దేశవ్యాప్తంగా కోట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాగా ఏర్పడి ఈ చోరీకి పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా 16 కోట్ల మందికి సంబంధించిన ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ల డేటాను నిందితులు చోరీ చేసినట్లు గుర్తించారు.


హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పలు ఆన్ లైన్ వెబ్ సైట్ల నుంచి ఈ డేటాను దొంగిలిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. పాన్ ఇండియా గవర్నమెంట్ ఉద్యోగుల డేటాతో పాటు పలు బ్యాంక్ ల క్రెడిట్ కార్డ్ ల డేటా, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న ఆర్గనైజేషన్ ల నుండి డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. చోరీ చేసిన డేటానంతా పలువురు అక్రమార్కులకు అమ్ముకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం ఆరుగురు సభ్యులున్న ముఠాను అదుపులోకి తీసుకోగా.. నిందితులు నాగపూర్, ఢిల్లీ, ముంబై చెందిన వారిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్లు నిర్ధారించారు. 


దేశ భద్రతకు భంగం కల్గించేలా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను అపహరిస్తున్నారని సీపీ వివరించారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైందన్నారు. కోట్లాదిగా సోషల్ మీడియా ఐడీలు, పాస్ వర్డ్ లు కూడా లీకయ్యాయని చెప్పుకొచ్చారు. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైందని తెలిపారు. కేటుగాళ్లు ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారని  స్పష్టం చేశారు. డేటా చోరీ గ్యాంగ్ లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారని... సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. సేకరించిన వ్యక్తిగత డేటాను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్ట్ చేశామని సీపీ వివరించారు.