Hyderabad Crime News: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం జరిగింది. లంగర్‌హౌస్‌లో గ్యాంగ్‌వార్ పడిగ విప్పింది. లంగర్‌హౌస్‌ లో ఉండే ఇర్ఫాన్ అనే ఓ యువకుడిని ముగ్గురు నిందితులు కిడ్నాప్ చేశారు. అనంతరం రాజేంద్ర నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అతడి బట్టలన్నీ తీసేసి నగ్నంగా మార్చి ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశారు. వద్దు భయ్యా, వద్దు భయ్యా అంటున్నా వినకుండా విపరీతంగా కొట్టారు. అంతేకాకుండా ఈ రాక్షస క్రీడను వీడియో తీశారు. అనంతరం వాటిని వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టుకున్నారు. తమ మాట వినకుంటే అందరి గతి ఇంతేనంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.


ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న ఇర్ఫాన్.. రాజేంద్ర నగర్ పోలీసులు ఆశ్రయించాడు. అయితే ఈ దాడి ఘటనలో ఇర్ఫాన్ ఒళ్లంతా వాతలు వచ్చాయి. వాటిని ఇర్ఫాన్ పోలీసులకు చూపించాడు. అతడిని చితక బాదినప్పుడు తీసిన వీడియోలు, వారు పెట్టిన స్టేటస్ లను కూడా పోలీసులకు చూపించాడు. తనను కిడ్నాప్ చేసి అనుక్షణం నరకం చూపించిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇర్ఫాన్ ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులతో చికిత్స ఇప్పించిన తర్వాత ఇంజురీ సర్టిఫికేట్ ను కూడా తీసుకొని.. ఇర్ఫాన్ ఇచ్చిన ఫిర్యాదుకు జత చేశారు. 


వాహనదారుడిపై దాడికి పాల్పడ్డ ఆటోమొబైల్ ఫైనాన్షియర్లు..!


రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఆటోమొబైల్ ఫైనాన్షియర్స్ రెచ్చిపోయారు. ఓ వాహనదారుడిపై కత్తితో దాడి చేశారు. ప్రతిఘటించిన వాహనదారుడు వారిని తప్పించుకొని ఎలాగో అలా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వరకు పరుగులు తీశాడు. అయినప్పటికీ పైనాన్షియర్స్ అతడిని వదలలేదు. పోలీస్ స్టేషన్ లో కూడా వాహనదారుడిపై దాడికి పాల్పడ్డారు. అయితే విషయం గుర్తించిన పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో బాలుడికి కూడా గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు గాయాల పాలైన వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వాహనదారుడికి సంబంధించిన వర్గం వాళ్లు పోలీస్ స్టేషన్ కు చేరుకొని... నానా హంగామా చేశారు. దాడి చేసిన వారి వర్గం వాళ్లు కూడా పోలీస్ స్టేషన్ కు చేరడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది.


విషయం తెలుసుకున్న కాప్స్ ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఇరు వర్గాల వాళ్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. వాహనం సీజింగ్ పేరుతో అడ్డగించి తనపై కత్తితో దాడి చేశారంటూ వాహనదారుడు ఫిర్యాదు చేశాడు. నిస్సార్ ఖాన్ మోటర్ సైకిల్ కిస్తీలు కట్టకపోవడంతో అడ్డగించి అడిగితే తమపై దాడి చేశారంటూ మరోవర్గం వాళ్లు చెబుతున్నారు. అయితే వాహనాల సీజింగ్ పేరుతో నెంబర్ ప్లేట్ లేని మోటర్ సైకిళ్లపై తిరుగుతూ.. ఆటో మొబైల్ ఫైనాన్షియర్లు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వారి పై చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.