Hyderabad Crime News: ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నత విద్యా వంతులు. అంతేనా వారికి చదువుకు తగ్గట్లుగా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. శ్రీహర్షిత విద్యా సంస్థలను విజయంతంగా నడిపిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో బాగానే పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అయితే తమకు వచ్చే లాభాలతో సంతృప్తి చెందని ఈ జంట అక్రమాల పాల్పడేందుకు సిద్ధమయ్యారు. తమ విద్యా సంస్థల్లో పార్టనర్ షిప్ ఇస్తామంటూ... చాలా మంది వద్ద నుంచి లక్షల్లో డబ్బులు గుంజారు.
ముందుగా తమ స్థానిక జిల్లాలో ఆ తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారి వద్ద ఇలా మోసాలకు పాల్పడ్డారు. అవి చాలవన్నట్లు తెలంగాణకూ వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని అనేక మంది వద్ద పార్టనర్ షిప్ పేరుతో కోట్లు కొట్టేశారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని వీరు మొత్తంగా రూ.35 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఆ తర్వాత విద్యా సంస్థల్లో లాభాలు కావాలని ప్రశ్నించిన వారిని బెదిరించడం మొదలు పెట్టారు. మరోసారి అడిగితే చంపేస్తామంటూ భయపెట్టారు. కానీ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కిలాడీ దంపతులు ఇద్దరూ అరెస్ట్ అయి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఏలూరుకు చెందిన నందిగం రాణి, ధర్మరాజు దంపతులు. ప్రస్తుతం వీరిద్దరూ ఏలూరులోని శ్రీహర్షిత విద్యా సంస్థ యజమానులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తమకు వచ్చే లాభాలు చాలకు మోసాల కోసం అదిరిపోయే ప్లాన్ వేశారు. ఇద్దరూ కలిసి తమ విద్యా సంస్థల్లో పార్టనర్ షిప్ పేరుతో అక్రమాలకు తెరతీశారు. ఇలా తమకు తెలిసిన వారి వద్ద, తమకు తెలిసిన వారి బంధువుల వద్ద ఈ మోసాలకు పాల్పడ్డారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 40 మంది వద్ద నుంచి కోట్లలో వసూలు చేశారు. కొందరి వద్ద లక్షలు కూడా దోచేశారు. ఆ తర్వాత వారు డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ రాణి, ధర్మరాజులపై కేసులు నమోదు అయ్యాయి.
ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా ఇలాగే మోసం చేసి 7 కోట్లకు పైగా దోచేశారు. గుంటూరు, ఏలూరుల్లోని తమ విద్యాసంస్థల్లో పెట్టుబడి పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వమని, లాభాలు ఇవ్వమని కోరాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కిలాడీ దంపతులు... అతడిని చంపేస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే బాధితుడు శ్రీనివాస్ హైదరాబాద్ సీపీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి... నిందితులు రాణి, ధర్మరాజు దంపతులను అరెస్ట్ చేశారు. అలాగే ఈ అక్రమాల్లో వీరికి సహకరించిన నందిగం లక్ష్మీ హర్షిత, జి కృష్ణారావు, జి సురేష్, రమేష్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా కిలాడీ దంపతులు అయిన రాణి, ధర్మరాజు దంపతులు నాంపల్లి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. నందిగం రాణిని చంచల్ గూడ మహిళా జైలుకు, ధర్మరాజును చంచల్ గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.