Hyderabad Crime : హైదరాబాద్  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో LKG చదువుతున్న బాలికపై(4) ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజినీకుమార్ లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా బాలికను డ్రైవర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. 2 నెలల నుంచి బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లితండ్రులు చిన్నారి ప్రశ్నించారు. అయితే సమాధానం చెప్పలేని పరిస్థితి చిన్నారి ఉన్నట్లు తల్లిదండ్రులు అంటున్నారు. చిన్నారి నీరసంగా ఉండి ఏడవడంతో అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వచ్చి చిన్న పిల్లలను ఇబ్బందులు గురిచేశాడని ఫిర్యాదులో తల్లిదండ్రులు తెలిపారు. ఆగ్రహంతో ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ ను తల్లిదండ్రులు చితక బాదారు. డ్రైవర్ రజినీకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


చిన్నారిపై వృద్ధుడి లైంగిక దాడి


 తొమ్మిదేళ్ల బాలికపై పలుమార్లు లైంగికదాడి చేసిన కేసులో 73 ఏళ్ల వృద్ధుడికి తాజాగా వైజాగ్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి నాలుగు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని మొబైల్ గేమ్‌లతో ఆకర్షించి తన ఇంటికి తీసుకెళ్లి అశ్లీల వీడియోలు చూడమని బలవంతం చేసి లైంగికదాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఐదు నెలల పాటు ఆమెపై లైంగికదాడి చేసి, జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు నిందితుడు. బాలిక తన తల్లితో కలిసి జీవిస్తోందని పోలీసులు తెలిపారు. లైంగికదాడి చేసిన వ్యక్తి కూడా అదే ప్రాంతంలోనే ఉన్నాడు. 


20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 


మార్చి 23, 2022న చిన్నారి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ దారుణమైన నేరం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి తన తల్లికి మొత్తం జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఆరిలోవ పోలీసులు నిందితుడు కోలాటి బాలయోగిపై ఐపీసీ సెక్షన్ 376, 354 (ఎ), 506, పోక్సో చట్టం-2012 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఏసీపీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ నేతృత్వంలో దిశ పోలీసులు విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ పోక్సో న్యాయమూర్తి కె.రామ శ్రీనివాస్‌ మంగళవారం తీర్పునిచ్చారని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కరణం కృష్ణ తెలిపారు. మహిళలు, బాలికల భద్రత, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్ణీత గడువులోగా నిందితులను అరెస్టు చేసి ఛార్జిషీట్ దాఖలు చేయడంలో నగర పోలీసులు కృషిచేశారని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేసిన పోలీసు బృందాన్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే కృష్ణను నగర పోలీస్‌ చీఫ్‌ శ్రీకాంత్‌ అభినందించారు. 


Also Read : Hyderabad News: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు అమ్ముతున్న ఐదుగురి అరెస్ట్!