Visakha Former Mp Mvv Satyanarayana : విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హయగ్రీవ సంస్థకు చెందిన భూముల వ్యవహారంలో విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు విషయంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసు విషయంలో హైకోర్టును ఎంవివి సత్యనారాయణ ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఈ దశలో ఎలాంటి మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రతివాదులైన పోలీసులు, ఫిర్యాదుదారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకుని విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని తమ విలువైన భూములు కాజేసేందుకు ప్రయత్నించారంటూ హయగ్రీవ ఇన్ ఫ్రాటెక్ కు చెందిన సిహెచ్ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆరిలోవ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తనపై నమోదైన కేసులు కొట్టేయాలంటూ మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది వైవి రవి ప్రసాద్ వాదనలు వినిపించారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చడానికి వీల్లేదు అంటూ వాదించారు. అరెస్టు నుంచి పిటిషనర్ కు రక్షణ కల్పించాలని కోరారు. ఈ వాదనను తోసిపుచ్చని న్యాయమూర్తి ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. 


వివాదానికి కేంద్ర బిందువుగా హయగ్రీవ ప్రాజెక్ట్..


నగరంలోని హయగ్రీవ ప్రాజెక్టు గత కొన్నాళ్ళుగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని వైసీపీ నేతలు తన నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆరోపిస్తూ సంస్థ ఎండిగా ఉన్న చెరుకూరు జగదీశ్వర్లు అలియాస్ జగదీశ్వరుడు రెండేళ్ల కిందట సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంసం అయింది. అదే జగదీశ్వరుడు తన భూమిని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయన స్నేహితుడు ఆడిటర్ జీవి, మరొకరు కబ్జా చేశారంటూ రెండు రోజుల క్రితం ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై కేసులు నమోదు చేయడంతో మరోసారి హయగ్రీవ ప్రాజెక్టు వివాదం తెరపైకి వచ్చింది. ఈ కేసుపైనే మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. హయగ్రీవ ప్రాజెక్టు వృద్ధుల కోసం ఇళ్లు నిర్మించేందుకు 2008లో ఎండాడలో 12.5 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. 15 ఏళ్లు అవుతున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే ముందుకు సాగలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన నుంచి బలవంతంగా ప్రాజెక్టును ఎంవీవీ సత్యనారాయణ లాక్కున్నారంటూ ఎండి జగదీశ్వరుడు గతంలోనే ఆరోపించారు. 


వీరిపై కేసులు నమోదు..


ఈ వ్యవహారంలో హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్ భాగస్వామిగా పేర్కొంటూ జగదీశ్వరుడు ఈ నెల 22న ఆరిలోవలో పోలీసులకు మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, ఆడిటర్ జీవీ, బ్రహ్మాజీపై ఫిర్యాదు చేశారు. 2020లో ఆయగ్రీవ ప్రాజెక్టు డెవలప్మెంట్ అగ్రిమెంట్ సమయంలో తనతోపాటు తన భార్యను బెదిరించి కొన్ని ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని, తమ సంతకాలను ఫోర్జరీ చేసి హైగ్రీవ ప్రాజెక్టు భూమిని కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగదీశ్వరుడు ఫిర్యాదుపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో నగరంలో చర్చినియాంసంగా మారింది. ఈ కేసు నమోదు అయిన తరువాత ముగ్గురూ నగరంలో ఆచూకీ లేకపోవడంతో వారిని విచారించేందుకు పోలీసులకు అవకాశం దొరకలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.