మారియా షరపోవా గురించి తెలియని వారు తక్కువ. ఎవరు అంటే ఎవరికి తెలిసినట్లుగా వారు టెన్నిస్ స్టార్ అని లేకపోతే అందగత్తె అని.. సూపర్ మోడల్ అని చెబుతారు. అంతే కానీ ఎవరూ చీటర్ అని చెప్పరు. అలాగే మైకేల్ షూమాకర్ ఎవరు అంటే.. ఫార్ములా వన్ రేసర్ అని తెలిసిన వాళ్లు అయినా చెబుతారు.. తెలియని వాళ్లు తెలియదని చెబుతారు. కానీ చీటర్ అని చెప్పరు. కానీ వీరిద్దర్నీ చీటర్లని చెబుతున్నారు ఢిల్లీకి చెందిన షెఫాలి అగర్వాల్ అనే మహిళ. అంతే కాదు.. ఆమె వారిపై న్యాయపోరాటం చేసి కేసులు కూడా పెట్టించారు. అందుకే ఈ విషయం ఇప్పుడు ఇంటర్నేషనల్ హాట్ టాపిక్ అయింది. అసలు వారు ఇండియాకు ఎప్పుడు వచ్చారు ? ఎలా షెఫాలి అగర్వాల్‌ను చీటింగ్ చేశారు ? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్సే.
ఢిల్లీలో రియల్‌టెక్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. అందులో ఆరేడు టవర్లు కట్టాలనుకున్నారు. అందులో ఒక టవర్‌కు షరపోవా అని పేరు పెట్టింది. మరో టవర్‌కు మైకేల్ షూమాకర్ పేరు పెట్టింది. ఈ పేర్లు నచ్చాయో.. లేకపోతే టవర్లు నచ్చాయో కానీ.. ఓ ఫ్లాట్‌ను షెఫాలీ అగర్వాల్ బుక్ చేసుకున్నారు. డబ్బులు కట్టారు. కానీ షరపోవా, షూమాకర్ టవర్లు మాత్రం రెడీ కాలేదు. ఒప్పందం ప్రకారం 2016కి పూర్తి కావాలి. కానీ కాలేదు. దీంతో ఆమె న్యాయపోరాటం ప్రారంభించారు.
గుర్గావ్‌లోని సెక్టార్ 73లో షరపోవా పేరు మీద ఉన్న ప్రాజెక్ట్‌లో తాను, తన భర్త రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నామని, అయితే డెవలపర్ కంపెనీలు తమ ప్రాజెక్ట్‌లో భాగంగా డబ్బు వసూలు చేశారని.. చివరకు ఫ్లాట్‌ను సిద్దం చేయకుండా తమను మోసం చేశాయంటూ కోర్టులో పేర్కొంది. తాము ప్రాజెక్ట్ గురించి ప్రకటనల ద్వారా తెలుసుకున్నామని.. ప్రాజెక్ట్ చిత్రాలు, వాగ్దానాలు చూసి కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి మోసపోయామని ఆమె కోర్టులో వాదించారు. కోర్టు కూడా ఆమె వాదనను కేసులు పెట్టాల్సిందేనని ఆదేశించింది. దీంతో గురుగ్రామ్ పోలీసులు మారియా షరపోవా, మైకేల్ షూమాకర్‌లపై కూడా కేసులు పెట్టారు.
అయితే ఆ ఇంటర్నేషనల్ స్టార్‌ల ఇద్దరి పేర్లు ఉన్నంత మాత్రానే కేసు పెట్టలేదు..నిజంగానే ఆ ప్రాజెక్టుకు వారుప్రచారం చేశారని షెఫాలి అగర్వాల్ చెబుతున్నారు. షరపోవా ప్రత్యేకంగా విందు సమావేశానికి వచ్చి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో టెన్నిక్ అకాడమీ పెడతానని హామీ కూడా ఇచ్చారట. అందే కాదు.. షరపోవా సైతం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కంపెనీ గురించి ప్రస్తావించిందని చెబుతున్నారు. డబ్బుల కోసం ట్వీట్లు.. పోస్ట్‌లు చేయడం సెలబ్రిటీలు సహజంగానే చేస్తూంటారు. అలాగే షరపోవా, షూమాకర్ కూడా చేసి ఉంటారు. కానీ ఇప్పుడు వారు అడ్డంగా ఇరుక్కుపోయారు.