దేశంలోనే మోస్ట్ వెయిటెడ్ సినిమాగా ఉన్న RRR చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆ సినిమా విషయంలో టికెట్ రేట్లు పెంచుకొనేందుకు అనుమతిస్తున్నట్లుగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. RRR సినిమాకు రూ.336 కోట్లు ఖర్చు అయినట్లుగా చిత్ర టీమ్ దరఖాస్తులో పేర్కొందని వెల్లడించారు. ఆ మేరకు టీడీఎస్, జీఎస్టీ కూడా వారు చెల్లించారని వెల్లడించారు. RRR సినిమా విడుదల తర్వాత 10 రోజుల వరకూ టికెట్ రేట్లు పెంచుకొనేందుకు అనుమతించినట్లుగా వెల్లడించారు.


గురువారం మధ్యాహ్నం పేర్ని ఏపీ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘RRR సినిమాకు హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లు కాకుండా సినిమా నిర్మాణానికి రూ.336 కోట్లు ఖర్చయిందని లెక్కలు చెప్పారు. దీనిపై జీఎస్టీ డిపార్ట్ మెంట్, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, హోం సెక్రటరీ అందరూ స్క్రూటినీ చేస్తున్నారు. త్వరలోనే ఆ ఫైల్ సీఎం వద్దకు వెళ్తుంది. నిర్మాణ వ్యయానికి తగ్గట్లుగా టికెట్ రేట్లు ఎంత ఖరారు చేయాలనే అంశాన్ని నిర్ణయిస్తాం.’’


‘‘సినిమా విడుదలైన మూడు నాలుగు రోజుల్లోనే ప్రజల నుంచి ఎక్కువ డబ్బు వసూలు చేసే అవకాశం లేకుండా చూసుకుంటాం. ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ నుంచి అప్లికేషన్‌ను స్క్రూటినీ చేసి త్వరలోనే టికెట్ ధరలు ఖరారు చేస్తాం. ఆ మేరకు త్వరలోనే జీవో విడుదల చేస్తాం. ఏ సినిమాకైతే రూ.100 కోట్ల బడ్జెట్ దాటుతుందో వాటికి ప్రత్యేక ధరలు వర్తిస్తాయి. 


5 షోలు ప్రదర్శితమవుతుంటే ఇది పాటించాలి
ప్రతి రోజు థియేటర్లలో 5 షోలు ప్రదర్శించవచ్చు. ఏదైనా పెద్ద సినిమా ఐదు షోలు ప్రదర్శితం అవుతున్నప్పుడు మధ్యలో ఏదైనా చిన్న సినిమా రిలీజైతే తప్పకుండా ఆ సినిమాకు మధ్యాహ్నం 11 నుంచి రాత్రి 9 గంటలలోపు ఒక షోకు అవకాశం ఇవ్వాలి. చిన్న సినిమా అంటే 20 కోట్లలోపు బడ్జెట్ ఉండే ప్రతిది చిన్న సినిమాగా పరిగణిస్తాం. ఆన్ లైన్ టికెటింగ్ కోసం టెండర్లు పిలిచాం. ఏప్రిల్, మేలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నాం. ప్రజలకు భారం కాకుండా అదే సమయంలో మంచి సినిమాలను ప్రోత్సహించేలా పెరిగే ధరలను ఖరారు చేస్తాం. 


కొత్తగా మొదలు కాబోయే సినిమాలన్నీ ఏపీలో 20 శాతం షూటింగ్ చేయాలి. వీటికి సబ్సిడీ ఉండదు కానీ, పర్మిషన్లన్నీ సింగిల్ విండో ద్వారా ఫ్రీగా ఇస్తు్న్నాం. తెలంగాణతో పాటు, ఉత్తరాదిన కూడా పర్మిషన్లు కావాలంటే ఫీజు చెల్లించాలి. కానీ, ఏపీలో ఉచితంగా అన్ని పర్మిషన్లు ఇస్తాం.’’ అని పేర్ని నాని వెల్లడించారు.