గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ బాలిక దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతంలో బాలికను ఓ దుండగుడు హత్య చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన బాలిక అంధురాలు. స్థానికంగా నివసించే ఓ యువకుడు ఓ కత్తితో బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని రాజు అని గుర్తించారు. 


గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. నిన్న (ఫిబ్రవరి 12) రాజు యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లి చెప్పింది. బాలిక ఈ విషయాన్ని తనకు చెప్పినట్లుగా ఆమె తెలిపింది. దీంతో తాము అతడిని మందలించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. దుండగుడు డీఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. సీఎం నివాసానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనించదగ్గ విషయం.