భూమ్మీద నూకలు ఉండి బతికిపోయాడు... అన్న డైలాగు మనం పెద్ద వాళ్ల నోట వింటుంటాం. ఎంతో పెద్ద ప్రమాదం నుంచి ఎవరైనా బతికితే... భూమ్మీద నూకలుండి బతికిపోయారు అని అంటుంటారు. సరిగ్గా ఇదే డైలాగ్ ఈ వీడియోలో బతికి బయటపడిన వ్యక్తికి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. 


గుజరాత్ లోని వడోదర సిటీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల వర్షాల కారణంగా రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. రోడ్లపై నీళ్లు కూడా నిలిచి ఉన్నాయి. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడు తన బైక్ పై ఒక మహిళతో ప్రయాణిస్తున్నాడు. ఆ మహిళ చేతిలో చిన్నారి కూడా ఉన్నాడు. రోడ్డుపై ఓ పక్క నీటి గుంత ఉండటంతో బైక్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని దాటబోయాడు. అదే సమయంలో ఓ ట్రాక్టర్ అతన్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది. 






సరిగ్గా అప్పుడే అతడు బైక్‌ని అదుపు చేయలేక పడిపోయాడు. వెనక ఉన్న మహిళ బిడ్డతో సహా కింద పడిపోయింది. ద్విచక్ర వాహనదారుడి తలపై నుంచి ట్రాక్టర్ ట్రక్కు వెనుక టైర్ వెళ్లింది. ఒక్కసారిగా ఈ వీడియో చూసిన వాళ్లు ఆ వ్యక్తి చనిపోయాడేమో... తలపై నుంచి టైరు వెళ్లింది అనుకుంటారు. కానీ, ఆ వ్యక్తి  ఎంతో అదృష్ట వంతుడు. అతడికి ఏమీ కాలేదు. ప్రాణాలతో బయటపడ్డాడు. తలకు చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నాడు. వెంటనే అక్కడున్న వారు అంబులెన్స్‌కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. 


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా... ఈ రోడ్లు బాగుపడవు, అదృష్ట వంతుడు కాబట్టే బతికి బయటపడ్డాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ, వీడియో చూసిన వారికి మాత్రం ఒకింత ఒళ్లు గగుర్పొడటం ఖాయం. 


రెండు రోజుల క్రితం ఇదే గుజరాత్ రాష్ట్రంలో దహోడ్ అనే ఏరియాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును క్రాస్ చేయబోయే క్రమంలో ప్రమాదవశాత్తూ ఆ బస్సు కిందే పడిపోయాడు. కానీ,  అదృష్టవశాత్తూ అతడు కూడా ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.