Girl molested In Sri Sathya Sai District | పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పి కుంట మండలం కొత్తమిట్ట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చెవిటి మూగ అయిన ఒక దివ్యాంగురాలిపై ఒక ఉన్మాది అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. అయితే తనపై అత్యాచారం కేసు నమోదు కావడంతో, అరెస్ట్ చేస్తారన్న భయంతో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారగుండ్ల గ్రామానికి చెందిన జనార్ధన్ అనే వ్యక్తి గతంలో వాలంటీర్ గా పనిచేశాడు. దివ్యాంగురాలికి పింఛన్ పంపిణీ చేసే క్రమంలో తరచు కొత్తమిద్దె గ్రామానికి వెళ్లేవాడు. ఆ సమయంలోనే ఆ దివ్యాంగురాలిని తప్పుడు దృష్టితో చూసేవాడు. వినాయక చవితి సందర్భంగా కొత్తపేట గ్రామంలో వినాయకుని మండపంలో పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే అదునుగా భావించిన నిందితుడు జనార్ధన్ అర్ధరాత్రి దివ్యాంగురాలిని పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి బలవంతంగా తీసుకెళ్లాడు. యువతి అడ్డుకునే ప్రయత్నం చేసినా, ప్రతిఘటించినా ఆ కామాంధుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాసేపటికి ఇది గమనించిన చిన్న పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు యువతిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న దివ్యాంగురాలి తండ్రి తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్ధరాత్రి సమయంలోనే గాలింపు చర్యలు చేపట్టిన నిందితుడు జాడ కనుగొనలేకపోయారు.
ఉదయాన్నే శవమై కనిపించిన నిందితుడు
దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన నిందితుడు జనార్దన్ ఉదయాన్నే సారగొండపల్లి గ్రామంలో శవమై కనిపించడం కలకలం రేపుతోంది. నిందితుని తల్లి ఫిర్యాదు మేరకు తన కొడుకు సారగొండ్లపల్లి గ్రామంలోని ఒక కన్ స్ట్రక్షన్ బిల్డింగులో ఉరివేసుకొని చనిపోయినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. నిందితుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడే ఒక సూసైడ్ నోటును గుర్తించారు. అందులో నా చావుకు ఎవరు కారణం కాదు అని రాసి ఉన్నట్లు గుర్తించారు. సూసైడ్ లెటర్లో తన సంతకంతో పాటు వేలిముద్రను కూడా నిందితుడు వేసినట్లు పోలీసులు గుర్తించారు. వేలిముద్ర ఆధారంగా యువతిపై అతడే అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అత్యాచారం అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు భావించారు. కానీ అరెస్ట్ భయంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: శ్రీకాకుళంలో గంజాయి డెన్ లపై నిఘా, 9 మంది అరెస్ట్ - కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వార్నింగ్