Crime News: ఆన్‌లైన్‌లో చాక్లెట్ల రూపంలో గంజాయి విక్ర‌యిస్తున్న ముఠాకు పోలీసులు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి చెక్ పెట్టారు. ఆయ‌ుర్వేద మందుల పేరుతో మార్కెట్లోకి వ‌దిలి యువ‌త‌ను మ‌త్తుకు బానిస‌గా మారుస్తున్న వైనంపై పోలీసులు ఫోక‌స్ పెట్టారు. గంజాయి చాక్లెట్ల నిర్వాహ‌కులు ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో ఆర్డ‌ర్ చేస్తే కొరియ‌ర్ ద్వారా డెలివ‌రీ చేస్తున్నార‌ని పోలీసులు గుర్తించారు. ఆయుర్వేద మందులుగా ర‌క‌ర‌కాల పేర్లతో త‌యారు చేసిన ఈ చాక్లెట్లపై 21 ఏళ్ల పైబడిన‌ వారికే అమ్మాలనే హెచ్చరికల‌ను ముద్రించారు. అవి ఆయుర్వేద మందులే అయితే ఇలా విచ్చ‌ల‌విడిగా దుకాణాల్లో విక్ర‌యంచ‌డంపై అనుమానాలు వ్య‌క్తమ‌య్యాయి. మొద‌ట ఈ చాక్లెట్ల వ్యవహారం టీజీ ఏఎన్‌బీ దృష్టికొచ్చింది. మందుల‌ను డాక్టర్‌ చీటీ ఆధారంగా కాకుండా న్‌లైన్‌లో అమ్మేస్తుండటంతో లోతుగా ఆరా తీసిన అధికారులు అసలు విషయం గుర్తించారు. హైద‌రాబాద్‌లో తీగ‌లాగితే ఈ డొంక రాజ‌స్థాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో క‌దిలింది. 


NCB-ANB సంయుక్త ఆప‌రేష‌న్‌..


తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) అధికారులు ఈ వ్య‌వ‌హారంపై వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేంద్ర ప్ర‌భుత్వ అదీనంలోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోతో (ఎన్సీబీ) సాయంతో ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ల్లో ఉన్న ఎనిమిది ఫ్యాక్టరీలను మూయించారు. 2022 నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గంజాయి చాక్లెట్లకు సంబంధించి ఏకంగా 42 కేసులు నమోదయ్యాయి. కొత్తూరు, చిట్యాల, మొయినాబాద్‌ తదితర ప్రాంతాల్లో పాఠశాలలకు దగ్గర్లో ఉన్న దుకాణాలను అడ్డగా చేసుకొని ఈ దందా సాగిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఇలా చాక్లెట్ల మాటున గంజాయి విక్రయించి విద్యార్థులను మాదకద్రవ్యాలకు బానిసలుగా చేశారు. జగిత్యాలలో గంజాయి చాక్లెట్లు తిన్న ఓ బాలుడు ఓ బాలికపై అత్యాచారం కూడా చేశాడు. నిజామాబాద్‌కు చెందిన కొందరు చిన్నారులు ఈ చాక్లెట్లకు బానిసలుగా మారారు. 


Also Read: ట్రైనీ డాక్టర్‌ డైరీలో చివరి పేజీ, ఈ దారుణానికి కొద్ది గంటల ముందు ఏం రాసుకుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు


ఆపరేషన్ ఎలా జ‌రిగిందంటే...


టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య, ఎస్పీలు సాయి చైతన్య, సీతారాం లు వ్యూహాత్మకంగా వ్యవహరించి డెకాయ్‌ ఆపరేషన్ పూర్తి చేశారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల నమోదుకు వినియోగించే ఎన్డీపీఎస్ చ‌ట్టం ఎంత కఠినమైందో, అంతే సున్నితమైంది. నిబంధనలు పాటించకపోతే కోర్టుల్లో ఆ కేసులు నిలబడవు. దీంతో సాక్షుల ఎదురుగానే ఇండియా మార్ట్‌ నుంచి ఆర్డర్‌ ఇచ్చారు. చెల్లింపులు కూడా సీఓడీ కాకుండా తమ అధికారిక ఖాతా నుంచే చేశారు. కంపెనీ నుంచి కొరియర్‌లో వ‌చ్చిన చాక్లెట్లను సైతం పంచ్‌ విట్నెస్‌ సమక్షంలోనే తీసుకొని పక్కాగా పంచనామా నిర్వహించారు. దీనిపై ఫిల్మ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు ధారంగా నమోదైన కేసులో ఆ కంపెనీ యజమానిని నిందితుడిగా చేర్చడంత‌తో పోలీసుల ఆప‌రేష‌న్ మ‌రింత వేగ‌వంత‌మైంది. మరింత లోతుగా ఆరా తీసిన అధికారులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజస్తాన్‌ల‌ల్లో ఉన్న 8 గంజాయి చాక్లెట్స్‌ తయారీ కంపెనీలను గుర్తించారు. ఈ గంజాయి చాక్లెట్లను ఆన్‌లైన్‌లో విక్ర‌యిస్తున్న‌ ఇండియా మార్ట్‌కు టీజీ ఏఎన్‌బీ నోటీసులు పంపించింది. దీంతో ఆ సంస్థ తమ వెబ్‌సైట్‌లో ఉన్న ఈ తరహా ఉత్పత్తుల‌ను తొలగించింది. ఇప్పుడు చాక్లెట్ల‌ను డెలివరీ చేసిన కొరియర్‌ సంస్థలకూ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధ‌మ‌య్యారు. గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం, ఫిర్యాదులు చేసేందుకు 87126 71111 నంబర్ ను పోలీసులు కేటాయించారు. స‌మాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య చెబుతున్నారు. 


Also Read: కోల్‌కత్తా ఘటన మరవకముందే మరో దారుణం, నర్స్‌పై అత్యాచారం - రాడ్‌తో కొట్టి ఉరి బిగించి హత్య