Housing Sales In Hyderabad: మన దేశంలో స్థిరాస్తి రంగాన్ని, ముఖ్యంగా హౌసింగ్ విభాగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా ఇళ్ల కొనుగోలుదార్ల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. ప్రాజెక్టులు పూర్తి చేయడంలో జాప్యం కారణంగా ఇళ్ల (ఇండిపెండెట్ హౌస్/అపార్ట్‌మెంట్ ఫ్లాట్) డెలివరీల్లో ఆలస్యం పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో నిలిచిపోయిన యూనిట్ల సంఖ్య 5 లక్షలు దాటిందని తాజా నివేదికను బట్టి తెలుస్తోంది.
ప్రతి ఐదు ఇళ్లలో ఒక ఇంటి విషయంలో జాప్యం
డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ (PropEquity) నివేదిక ప్రకారం, గత 8 ఏళ్లలో, దేశంలోని 44 నగరాల్లో మొత్తం 1,981 హౌసింగ్ ప్రాజెక్టులు ఆగిపోయాయి. పంపిణీలో జాప్యం వల్ల నిర్మాణాలు నిలిపోయిన ఇళ్ల సంఖ్య 5 లక్షలు దాటింది. ఈ 8 ఏళ్లలో, నిర్మాణంలో ఉన్న ప్రతి ఐదు ఇళ్లలో ఒక గృహాన్ని ఇంతవరకు పూర్తి చేయలేదు, కొనుగోలుదార్లకు అందించలేదు. డెలివరీ చేసిన నాలుగు ఇళ్లను కూడా 3 నుంచి 4 ఏళ్లు ఆలస్యంగా అందించారు.
2018 నుంచి ఇప్పటి వరకు 9 శాతం పెరుగుదల
ప్రాప్‌ఈక్విటీ రిపోర్ట్ ప్రకారం, ప్రాజెక్టుల్లో జాప్యం కారణంగా నిర్మాణం స్తంభించిపోతున్న ఇళ్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. 2018 సంవత్సరంలో 4 లక్షల 65 వేల 555 గృహాలు ఈ లెక్కలో ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 5 లక్షల 8 వేల 202 యూనిట్లకు చేరుకుంది. అంటే, ఈ కాలంలో పంపిణీ చేయలేని ఇళ్ల సంఖ్య 9 శాతం పెరిగింది.
హైదరాబాద్‌లో ఆగిన ఇళ్ల సంఖ్య
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 25 హౌసింగ్ ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఫలితంగా 6,169 యూనిట్ల (ఇండిపెండెట్ హౌస్/అపార్ట్‌మెంట్ ఫ్లాట్) నిర్మాణంలో ముందుడుగు పడడం లేదు. తమ ఇంటిని ఎప్పుడు అప్పగిస్తారా అని కొనుగోలుదార్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. "ప్రాజెక్టులను పూర్తి చేయడానికి డెవలపర్ల దగ్గర తగిన సామర్థ్యాలు లేకపోవడం, సమయానికి డబ్బు అందకపోవడం, కొనుగోలుదార్ల నుంచి అడ్వాన్స్‌ల రూపంలో తీసుకున్న డబ్బును వేరొకచోట పెట్టుబడులుగా పెట్టడం" వంటివి నిర్మాణ జాప్యాల్లో కారణాలని ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది.
టైర్-1 నగరాల్లో చాలా మంది గృహ కొనుగోలుదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని 14 టైర్-1 నగరాల్లో మొత్తం 1,636 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఈ కారణంగా 4 లక్షల 31 వేల 946 గృహాల యూనిట్లు పంపిణీ కాలేదు. ఈ లిస్ట్‌లో... గ్రేటర్ నోయిడా 74,645 యూనిట్లతో టైర్-1 నగరాల్లో మొదటి స్థానంలో ఉంది. 28 టైర్-2 నగరాల్లో 76,256 యూనిట్లు డెలివరీ కాలేదు. ఈ లిస్ట్‌లో.. భివాడి 13,393 యూనిట్లతో మొదటి స్థానంలో ఉంది.
వివిధ నగరాల్లో నిలిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులు:
హైదరాబాద్ --- నిలిచిన ప్రాజెక్టులు: 25 --- ఆగిన ఇళ్లు: 6,169
ముంబయి --- నిలిచిన ప్రాజెక్టులు: 234 --- ఆగిన ఇళ్లు: 37,883
బెంగళూరు --- నిలిచిన ప్రాజెక్టులు: 225 --- ఆగిన ఇళ్లు: 39,908
థానే --- నిలిచిన ప్రాజెక్టులు: 186 --- ఆగిన ఇళ్లు: 57,520
పుణె --- నిలిచిన ప్రాజెక్టులు: 172 --- ఆగిన ఇళ్లు: 24,129
గురుగ్రామ్ --- నిలిచిన ప్రాజెక్టులు: 158 --- ఆగిన ఇళ్లు: 52,509
నవి ముంబయి --- నిలిచిన ప్రాజెక్టులు: 125 --- ఆగిన ఇళ్లు: 28,466
గ్రేటర్ నోయిడా --- నిలిచిన ప్రాజెక్టులు: 103 --- ఆగిన ఇళ్లు: 41,438
చెన్నై --- నిలిచిన ప్రాజెక్టులు: 92 --- ఆగిన ఇళ్లు: 21,867
కోల్‌కతా --- నిలిచిన ప్రాజెక్టులు: 82 --- ఆగిన ఇళ్లు: 24,174
ఘజియాబాద్ --- నిలిచిన ప్రాజెక్టులు: 50 --- ఆగిన ఇళ్లు: 15,278
లఖ్‌నవూ --- నిలిచిన ప్రాజెక్టులు: 48 --- ఆగిన ఇళ్లు: 13.024
జైపుర్ --- నిలిచిన ప్రాజెక్టులు: 37 --- ఆగిన ఇళ్లు: 9,862
భోపాల్ --- నిలిచిన ప్రాజెక్టులు: 27 --- ఆగిన ఇళ్లు: 7,500
ఫరీదాబాద్ --- నిలిచిన ప్రాజెక్టులు: 16 --- ఆగిన ఇళ్లు: 7,060
న్యూదిల్లీ --- నిలిచిన ప్రాజెక్టులు: 1 --- ఆగిన ఇళ్లు: 900
మరో ఆసక్తికర కథనం: యూపీఐ చెల్లింపుల్లో మహా విప్లవం - ఒకే బ్యాంక్ ఖాతా నుంచి ఐదుగురికి 'పేమెంట్ యాక్సెస్'