Fried Rice with Avakaya : అన్నం, ఆవకాయ ఉంటే చాలు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఆవకాయను తలచుకుంటే నోట్లో నీళ్లు ఊరే వాళ్లు కూడా కోకొల్లలుగా ఉంటారు. అయితే ఈ ఆవకాయ రుచిని మరింత పెంచే ఫ్రైడ్ రైస్ గురించి తెలుసా? అవును ఆవకాయ ఫ్రైడ్ రైస్. దీనిని చేయడం చాలా సులభం. అంతేకాకుండా రుచిలోనూ ఇది మ్యాజిక్ చేస్తుంది. దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. సమయం వృథా కాదు. కానీ మీరు ఖర్చుపెట్టిన ప్రతి సెకండ్.. అది తింటున్నప్పుడు వర్త్ అనిపిస్తుంది. మరి ఈ టేస్టీ ఆవకాయ ఫ్రైడ్ రైస్‌ని ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
ఆవకాయ - అరకప్పు
గుడ్లు - 3
కారం - రెండు టీస్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
క్యారెట్ - 1
పచ్చిమిర్చి - 3
ఉల్లిపాయలు - 1
కరివేపాకు - 1 రెబ్బ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
సోయా సాస్ - అర టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి దానిలో తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అన్నం పొడిపొడిలాడేలా చూసుకోవాలి. మెత్తగా అయితే ఫ్రైడ్రైస్కి అంత బాగోదు. బియ్యంలో సాల్ట్ వేయకుండా ఉడికించుకోవడమే మంచిది. ఇప్పుడు ఉడికిన అన్నంలో కప్పు ఆవకాయ పచ్చడిని తీసుకుని వేసుకోవాలి. గరిటతో దానిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేయకుండా కూడా ఇలా ఆవకాయ అన్నాన్ని చాలామంది ఇష్టంగా తింటారు. అయితే దీని రుచిని పెంచుకోవడం కోసం ఈ టేస్టీ ఫ్రైడ్ రైస్‌ని తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. అది వేడి అయ్యోలోపు ఓ గిన్నెలో ఎగ్స్ తీసుకోండి. దానిని బాగా కలపండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. దానిలో ఎగ్స్ మిశ్రమం వేసి ఓ ముప్పై సెకన్లు ఉంచి.. ఆ తర్వాత కలపాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు ముక్కలుగా బాగా వస్తుంది. ఇలా కలిపుతూ దానిలో కాస్త కారం, ఉప్పు కూడా వేయాలి. ఇవి రెండూ గుడ్డు పట్టి.. ఉడికిన తర్వాత.. ఈ ఎగ్స్‌ను వేరే గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు అదే కడాయిలో మరికొంత నూనె వేసి.. దానిలో క్యారెట్ వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం మగ్గితే సరిపోతుంది. దానిలో సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి కలపాలి. అవి కాస్త మగ్గని తర్వాత దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్స్ వేయాలి. తర్వాత ఆవకాయ అన్నాన్ని కూడా వేసి అన్ని బాగా కలిసేలా కలిపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ.
ఈ టేస్టీ రెసిపీని మీరు లంచ్ బాక్స్‌కి తీసుకెళ్లొచ్చు. లేదంటే మధ్యాహ్నం లంచ్ లేదా సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవచ్చు. రాత్రి మిగిలిన అన్నంతో, మధ్యాహ్నం వండిన రైస్ మిగిలిపోతే కూడా ఈ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని తయారు చేసుకుని ఇంటిల్లిపాది లాగించేయండి.
Also Read : టేస్టీ, స్పైసీ మినపప్పు పచ్చడి.. నెల్లూరు స్టైల్లో ఇలా చేసేయండి