Nurse Molested Killed: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశమంతా భగ్గుమంటుండగానే మరో దారుణం జరిగింది. ఉత్తరాఖండ్‌లో ఓ నర్స్ హత్యాచారానికి గురైంది. జులై 31వ తేదీన అదృశ్యమైన ఆ మహిళ యూపీలో ఓ ఖాళీ ప్రదేశంలో శవమై కనిపించింది. ఆగస్టు 8వ తేదీన ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. జులై 31న బాధితురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కంప్లెయింట్‌పై విచారణ మొదలు పెట్టిన పోలీసులు యూపీలోని బిలాస్‌పూర్‌లో చెట్ల పొదల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే ఆ బాడీ కుళ్లిపోయింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్స్‌గా పని చేస్తున్న బాధితురాలు..చివరి సారి జులై 30వ తేదీన కనిపించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. బిలాస్‌పూర్‌లో ఓ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించగా వెంటనే పోలీసుల బృందాలు రంగంలోకి దిగి గాలించాయి. ఆమె మొబైల్ నంబర్‌ని ట్రాక్ చేశారు. ఆ మహిళను ఓ వ్యక్తి వెంబడించినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది.
విచారణలో భాగంగా పోలీసులు బరేలీ వెళ్లారు. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అన్ని చోట్లా జల్లెడ పట్టారు. హరియాణా సహా రాజస్థాన్‌లోనూ గాలించారు. నిందితుడు ధర్మేంద్ర రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్నట్టు గుర్తించారు. నిందితుడితో పాటు అతని భార్యనీ అరెస్ట్ చేసి రుద్రపూర్‌కి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇద్దరినీ విచారించారు. తానే అత్యాచారం చేసి చంపినట్టు నిందితుడు అంగీకరించాడు. జులై 30న నర్స్ రోడ్‌పై ఒంటరిగా కనిపించిందని, ఆ సమయంలో చీకటిగా ఉందని చూసి బలవంతం చేసినట్టు చెప్పాడు. పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు. అత్యాచారం చేసే క్రమంలో ఆమె ప్రతిఘటించడం వల్ల రాడ్‌తో బలంగా తలపై కొట్టాడు. చున్నీతో ఉరి బిగించి చంపేశాడు. ఆమె డెడ్‌బాడీని అక్కడే పడేసి ఫోన్‌తో పాటు రూ.30 వేల నగదుతో పరారయ్యాడు. కోల్‌కత్తా ఘటనతో ఇప్పటికే దేశమతా అలజడిగా ఉంది. ఆడవాళ్లని ఇలా హింసించి చంపే వాళ్లని వదలకూడదని పలు చోట్ల మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోల్‌కత్తాలో అత్యాచారం జరిగిన హాస్పిటల్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై రాజకీయంగా దుమారం రేగింది. బీజేపీయే ఈ దాడులు చేయించిందని మమతా బెనర్జీ ఆరోపించారు.