Doctor's Strike on 17 Aug: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన పరిణామాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(Indian Medical Association ) సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యంత బాధాకరమైన ఘటన జరగడమే కాకుండా నిరసన తెలుపుతున్న వైద్యవిద్యార్థులపై దాడిని కూడా ఆ ఐఎంఏ ఖండించింది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇలాంటి దాడులు జరగడం హేయమైన చర్యగా అభివర్ణించింది.
అత్యవసర సేవలు అందుతాయి
వీటన్నింటినీ నిరసిస్తూ శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు దేశ వ్యాప్తంగా ఆధునిక వైద్యులు అందించే వైద్య సేవలు నిలిపి వేస్తున్నట్టు పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని పేర్కొంది. కాజ్యువాలిటీస్ విధులకు వైద్యులు హాజరవుతారని పేర్కొంది. మిగతా ఓపీడీఎస్‌లు, అత్యవసరమైత తప్ప మిగతా సర్జరీలు జరగవని తేల్చి చెప్పింది.
ప్రజల మద్దతు అవసరం
ఏ ఏ ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యసేవలు అందుతున్నాయో అన్ని ప్రాంతాల్లో సర్వీస్‌లు నిలుపేస్తున్నట్టు ఐఎంఏ ప్రకటించింది. న్యాయమైన కారణాలతో చేస్తున్న బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు అవసరం ఉందని ఐఎంఏ రిక్వస్ట్ చేస్తోంది.
మళ్లీ FORDA నిరసనలు
ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA) కూడా నిరసనను పునఃప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. ఫిజిషియన్ ట్రైనీ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహానికి గురైంది. వైద్యులంతా నిరసనలు చేస్తున్నారు. AIIMS, VMMC-సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌తో సహా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రెసిడెంట్ వైద్యులు సోమవారం ఉదయం నుంచి కొన్ని సేవలను బహిష్కరిస్తున్నారు. వైద్య సిబ్బందికి మెరుగైన భద్రత కల్పించే చట్టాల చేయాలన్న డిమాండ్తో సమ్మె చేస్తున్నారు. మంగళవారం, కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డాతో సమావేశమైన తర్వాత సమ్మెను విరమించాలని నిర్ణయించినట్లు FORDA తెలిపింది.
వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు సెంట్రల్ హెల్త్‌కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆమోదింపజేస్తామన్న హామీ సహా ఇతర డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్రం ఓకే చెప్పడంతో నిరసన విరమించినట్టు ప్రకటించారు. అయితే తమను సంప్రదించకుండా సరైన న్యాయం జరగకుండా ఇలా సమ్మెను విరమించడంపై వైద్యుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. అనేక ఆసుపత్రుల రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అభ్యంతరాలతో నిరసనలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఫోర్డా ప్రకటించింది.
NMC టాస్క్‌ఫోర్స్ కీలక సూచనలు
ఈ నిరసనలు సాగుతుండగానే జాతీయ వైద్య కమిషన్ (NMC) ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కీలక సిఫార్సులు చేసింది. రెసిడెంట్ వైద్యులకు వారానికి గరిష్టంగా 74 వర్క్ అవర్స్, అన్ని మెడికల్ కాలేజీలలో AIIMS-ఢిల్లీ స్థాయి వేతనాలు ఉండేలా సూచనలు చేసింది. అధిక డ్యూటీ వేళలు వైద్యుల ఆరోగ్యం, రోగిపై కూడా ప్రభావం చూపుతోందని పేర్కొంది. వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో ఈ కేసులను సమీక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
కోల్‌కతా రేప్ కేసులో 12 మంది అరెస్ట్
ఆగస్టు 9న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. మహిళపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసినట్టు నిర్దారణైంది. ఈ మొత్తం వ్యవహారంలో మరుసటి రోజే ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించగా, ఐదుగురు వైద్యులను గురువారం విచారణకు పిలిచారు. ఈ హత్యాచారం కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు.
Also Read: బీజేపీ వాళ్లే హాస్పిటల్‌ని ధ్వంసం చేశారు, మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు