Junior Artists Dies In Gachibowli Road Accident: హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందినట్లు సమాచారం. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళుతుండగా శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. 


హెచ్‌సీయూ రోడ్డులో వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. ఆపై చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధూను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు ఉండగా, మరో వ్యక్తి ఓ బ్యాంకులో పని చేస్తున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మద్యం సేవించినట్లు గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఈ కోణంలోనూ విచారణ చేపట్టారు. 


మహబూబ్ నగర్‌కు చెందిన మానస(21), కర్ణాటకకు చెందిన ఎన్ మానస (21) జూనియర్ ఆర్టిసులుగా చేస్తున్నారు. వీరితో పాటు సిద్ధూ అనే మరో జూనియర్ ఆర్టిస్ట్.. అబ్దుల్ రహీమ్ ఆ కారులో ప్రయాణించారు. అబ్దుల్ రహీమ్ మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇతడి స్వస్థలం. వీరంతా అమీర్ పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. 
Also Read: Vijayawada Crime: బెజవాడ 'ఖాకీ'ల సాహసం... గుజరాత్ వెళ్లి చెడ్డీ గ్యాంగ్ కు వల ... ముగ్గురు నిందితులు అరెస్టు 


అతివేగమా.. మద్యం మత్తులోనా...


కారు అతివేగంతో నడపటమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మరోవైపు కారులో ప్రయాణిస్తున్న వారు మద్యం సేవించి ఉన్నారని, వాహనం నడిపిన వ్యక్తి మద్యం సేవించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి పార్టీ చేసుకుని తెల్లవారుజామును తిరిగి వెళ్తుండగా డివైడర్‌ను, చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముగ్గురు చనిపోయారు. కారు సైతం నుజ్జు నుజ్జయిన తీరు చూస్తే అతివేగం ఓ కారణంగా తెలుస్తోంది. ఒక్క ప్రమాదం మూడు కుటుంబాలలో విషాదం నింపింది. రోడ్డు ప్రమాదంలో వీరు చనిపోయారని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి