విజయవాడ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలతో చెడ్డీ గ్యాంగ్ నగరవాసులకు కంటి మీద కునుకులేకుండా చేసింది. చెడ్డీ గ్యాంగ్ వివరాలను సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు. గ్యాంగ్ సభ్యులు ముగ్గురిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. 15 రోజుల నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి చోరీ సొత్తులో 20 వేల నగదు, ముప్పై రెండు గ్రాముల బంగారం, రెండున్నర కేజీలు వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి విజయవాడ నుంచి ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, గుజరాత్ కు వెళ్లి ఎంతో శ్రమించాయని తెలిపారు. పోరంకి వసంత నగర్ లో దొంగతనానికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల నుంచి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విజయవాడ టూ టౌన్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటపల్లిలో జరిగిన చోరీ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. మరికొంతమంది పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.
Also Read: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?
అసలెవరూ చెడ్డీ గ్యాంగ్?
చెడ్డీ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్ లో వణుకు పుట్టిస్తున్న ప్రధాన దోపిడి ముఠా. ఇప్పటికే విజయవాడలో పోలీసులకు దొరక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్ మూలాలు గుజరాత్ లోని దవోద్ జిల్లా గూద్ బాలా తాలుకాలోని నహేడా అనే గిరిజన గ్రామం నుంచి ఉన్నాయి. వీరు దోపిడీలకు పాల్పడక ముందు అడవిలోని పోడు భూములలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అక్కడ ఉన్న జీవులను వేటాడటం వీరి ప్రధానవృత్తి. పేస్ పార్థి అనేది వీరి తెగ. అయితే వీరు దోపిడీలు చేసే సమయంలో చెడ్డీలు ధరించి వస్తారు. కాబట్టి వీరికి చెడ్డీ గ్యాంగ్ అని పేరు వచ్చింది. మొదట్లో వీరు ఎలాంటి దోపిడీలు చేయకుండా తమ వృత్తినే నమ్ముకొని జీవనం సాగించేవారు. కానీ ప్రకృతి విపత్తులు దాడి చేయడంతో వ్యవసాయం వీరికి కలిసి రాలేదు. వన్యమృగాలును వేటాడటం ప్రభుత్వం నిషేదించింది. దీంతో వీరికి ఏం చేయాలో దిక్కుతెలిని సమయంలో ఆ తెగ పెద్ద అయిన రాంజీ ఒక ఐదుమందితో ముఠాను ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్తారు. అయితే అలా తమ తెగను కాపాడుకొనేందుకు ప్రారంభమైన ముఠా క్రమంగా పదులు సంఖ్యలోకి విస్తరించింది. 1987లో ప్రారంభమైన వీరి దొంగతనాలు 1999లో బాహ్య ప్రపంచానికి తెలిసి వచ్చింది. అప్పటి వరకు వీరి అకృత్యాల గురించి తెలిసినప్పటికీ ఎవ్వరు చేస్తున్నారన్నది మాత్రం బయటకు రాలేదు.
Also Read: ఇక చెడ్డీ గ్యాంగ్ ల ఆటకట్టు... రంగంలోకి ప్రత్యేక నిఘా బృందాలు... విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా
బెజవాడలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్
బెజవాడలో చెడ్డీ గ్యాంగ్ ఇటీవల చెలరేగిపోయింది. నగర శివారులో వరుస దోపిడీలతో పోలీసులకు సవాల్ విసిరారు. చెడ్డీలు ధరించి, మారణాయుధాలతో దొంగతనాలకు తెగబడుతున్నారు. ఇటీవల సీఎం క్యాంపు ఆఫీసుకు సమీపంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అపార్ట్ మెంట్ లలో చోరీ చేశారు. దొంగతనం సమయంలో ఎవరైనా ప్రతిఘటిస్తే వారిని హతమార్చడం, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడడం చేస్తున్నారు చెడ్డీ గ్యాంగ్. వినడానికి వణుకు పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్ ఇటీవల హైదరాబాద్‌లో దడ పుట్టించారు. ఇప్పుడు ఏపీలో చెడ్డీ గ్యాంగ్ హడలెత్తిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో చెడ్డీ గ్యాంగ్ వరుసగా చోరీలకు పాల్పడ్డారు. పది రోజుల వ్యవధిలో చెడ్డీ గ్యాంగ్ ఐదు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. చిట్టి నగర్, గుంటుపల్లి, తాడేపల్లి, కుంచనపల్లి అపార్ట్ మెంట్లలలో దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?