Road Accidents In Telangana: తెలంగాణలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. కుటుంబ కలహాలతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో చోట ఆర్థిక ఇబ్బందులతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అటు, రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేటలోని (Siddipet) వివేకానందనగర్ కాలనీకి చెందిన సత్యం (49) ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాడు. పదేళ్ల క్రితం భార్య చనిపోగా రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకి కుమార్తె త్రివర్ణ హాసిని (5), కుమారుడు అన్వేష్ నందా (7). శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకుని చింతల్ చెరువులో సత్యం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు గాలించిన పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో తన సోదరుడికి రూ.4 లక్షలు అప్పు ఇచ్చాడని.. అవి తిరిగి ఇవ్వకపోగా అవమానించడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యం గత కొన్ని రోజులుగా ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటానని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో..
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల (Siricilla) పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 37వ వార్డు మైసమ్మపల్లికి చెందిన బైరి అమర్ (45), స్రవంతి (40) దంపతులు తమ పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. అమర్ తనకున్న దుప్పట్ల వ్యాపారం చేసేవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని వ్యాపారుల నుంచి దుప్పట్లు ఆర్డర్లు తీసుకుని.. తాను నేయడంతో పాటు ఇక్కడున్న మరికొందరు ఆసాములకు ఉపాధి కల్పించేవారు. ఇటీవల అప్పు చేసి ఇల్లు కొన్నారు. అప్పిచ్చిన వారు ఇబ్బంది పెట్టడంతో 4 జోడీల సాంచలను అమ్ముకున్నారు. ఈ క్రమంలో అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో శనివారం సాయంత్రం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది..
- జగిత్యాల సమీపంలో కరీంనగర్ - జగిత్యాల రహదారి ధరూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- కర్ణాటకలోని కలబురగి జిల్లా కమలాపుర తాలూకా మరగుత్తి క్రాస్ వద్ద శనివారం ఉదయం గూడ్స్ వ్యాన్‌ను కారు ఢీకొని భార్యాభర్తలు, కుమారుడితో పాటు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన బీడీఎల్ ఉద్యోగి భార్గవ కృష్ణప్ప, ఆయన భార్య సంగీత, వారి కుమారుడు రాఘవ్, మహబూబ్‌నగర్ జిల్లా తాడిపర్తికి చెందిన కారు డ్రైవర్ దుర్గం రాఘవేందర్‌గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- ముచ్చర్ల గేట్ వద్ద ఆదివారం కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మెహదీపట్నంలోని ఓ ట్రావెల్స్‌లో కారు అద్దెకు తీసుకుని శ్రీశైలం డ్యామ్ సందర్శనకు వెళ్తుండగా.. మార్గమధ్యలో గేట్ దగ్గర కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారులో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.