Revanth Reddy visits Kurumurthy Swamy Temple | మహబూబ్‌నగర్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని జరుగుతున్న కురుమూర్తి స్వామి జాతరలో పాల్గొనున్నారు. కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కురుమూర్తి గుట్టపైకి రూ.110 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కురుమూర్తి స్వామి స్వామిని దర్శించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు కురుమూర్తి స్వామి వారిని దర్శించుకున్నా ఈసారి దర్శించుకోవడం ప్రత్యేకం. సీఎంగా తొలిసారి కురుమూర్తి జాతరకు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పూజారులు సీఎం రేవంత్ రెడ్డిని శాలువా కప్పి సత్కరించారు. స్వామి వారి చిత్రపటం సీఎం రేవంత్ కు బహూకరించారు. పక్కన ఉన్న మరో ఆలయాన్ని సైతం సీఎం రేవంత్, మంత్రులు దర్శించుకుని, ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.








ముగిసిన బ్రహ్మోత్సవాలు, మొదలైన కురుమూర్తి జాతర


కురుమూర్తి బ్రహ్మోత్సవాలు శుక్రవారం (నవంబర్ 9న) ముగిశాయి. శనివారం ప్రారంభమైన కురుమూర్తి జాతర దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. రెండో శనివారం  కావడంతో నవంబర్ 9న భారీ సంఖ్యలో భక్తులు కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. నేడు సెలవురోజు అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల వారు భారీ సంఖ్యలో కురుమూర్తి క్షేత్రానికి వచ్చారు. అధికారులు ఈ మేరకు సీఎం పర్యటనకు ఏర్పాటు చేశారు. 




సొంత జిల్లా పాలమూరు (ఉమ్మడి జిల్లా)లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కావడంతో కురుమూర్తి దేవాలయం చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. 10 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలతో పాటు భారీగా సిబ్బంది పోలీసులు బందోబస్తులో ఉన్నారని చిన్నచింతకుంట ఎస్ఐ ఆర్.శేఖర్ తెలిపారు.



పర్యటనకు హెలికాప్టర్ క్యాన్సిల్
సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి పర్యటన రెండు రోజుల కిందట ఖరారయింది. మొదట ఆయన హెలికాప్టర్ ద్వారా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి క్షేత్రానికి వస్తారని అధికారులు తెలిపారు. అందుకు అమ్మాపూర్ సమీపంలో హెలిప్యాడ్​ను సైతం అధికారులు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. అనివార్య కారణాల హెలీకాప్టర్​ను క్యాన్సిల్ చేయగా... సీఎం రేవంత్, మంత్రులు రోడ్డు మార్గాన చేరుకుని కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు.