Farmer Family Forceful Death In Nizamabad: కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన తీవ్ర విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేష్, ఆయన భార్య హేమలత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీష్ అనే కొడుకు ఉన్నాడు. ఆన్ లైన్ బెట్టింగులకు బానిసైన అతను.. రూ.లక్షల్లో బెట్టింగులు కాశాడు. ఈ క్రమంలో రూ.30 లక్షలు అప్పులు కాగా.. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. తమ జీవనోపాధిగా ఉన్న పొలాన్ని అమ్మినా అప్పు తీరకపోవడంతో ఇక చావే శరణ్యమని భావించారు. శుక్రవారం రాత్రి ఇంట్లో ముగ్గురూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు బానిసత్వానికి కుటుంబం బలైందంటూ స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆన్ లైన్ ట్రేడింగ్‌లో నష్టపోయి..
ఆన్ లైన్ ట్రేడింగ్‌లో రూ.లక్షలు నష్టపోయిన కొడుకు బలవన్మరణానికి పాల్పడగా.. తన కుమారుడి మరణాన్ని తట్టుకోలేని ఆ తల్లి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ సూర్యనగర్ కాలనీ రోడ్డు నెంబర్ - 2లో తాటికొండ లూర్దమ్మ, శ్రీనివాస్‌రెడ్డి దంపతులు.. కుమారుడు అఖిల్‌రెడ్డి (24)తో కలిసి ఉంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి సివిల్ కాంట్రాక్టర్ కాగా.. లూర్దమ్మ సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పారామెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అఖిల్ రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా సుమారు రూ.20 లక్షలు నష్టపోయారు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యాహ్నం తల్లి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి ఆమె సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి చూసే సరికి అఖిల్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. కుమారుని బలవన్మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లి గురువారం అర్ధరాత్రి బాత్రూం శుభ్రం చేసే రసాయనాన్ని తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతోంది.
తండ్రిని చంపేసిన కొడుకు
ప్రతిరోజూ మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తూ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ కొడుకు కన్న తండ్రినే హతమార్చాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఉట్పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో కావలి రాములు కుటుంబం నివాసం ఉంటోంది. రాములు కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిసై రోజూ తాగొచ్చి కుటుంబ సభ్యులను వేధించేవాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి కుటుంబంతో గొడవపడ్డాడు. కూతురిని అసభ్య పదజాలంతో దూషించాడు. రాములు కొడుకు శివకుమార్ తండ్రిని వారించినా అతనిపై కూడా చేయి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి.. కొడుకు శివకుమార్ బలమైన ఆయుధంతో తండ్రిని తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Case Against Nagarjuna : నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు