Case Registered against actor Nagarjuna at Madapur police station : ఎన్ కన్వెన్షన్ యజమాని , నటుడు నాగార్జునకు వరుసగా కష్టాలు వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ఇష్యూలో తమ కుటుంబాన్ని ప్రస్తావించి విమర్శలు చేశారని ఆమెపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న దశలో నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు అయింది. చెరువును కబ్జా చేశారని జనం కోసం అనే స్వచ్చంద సంస్థకు చెందిన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి లాభాలు ఆర్జించారని భాస్కర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చెరువును కబ్జా చేసి భారీగా సంపాదించారని కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్
చెరువును నాగార్జున కబ్జా చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ధృవీకరించిన ఆధారాలు కూడా తన ఫిర్యాదుకు జత చేసినట్లుగా తెలుస్తోంది. తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని.. వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఫిర్యాదులో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని కోరారు. న్యాయసలహా తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు.
సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు
ఇటీవల భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా
ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు ఇటీవలే కూల్చివేశారు. అలా కూల్చివేయడానికి హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో జనం కోసం స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనే పోలీసులకూ ఫిర్యాదు చేశారు. నాగార్జున చాలా కాలం క్రితం మరో పార్టనర్‌తో కలిసి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ చెరువులోనే ఉందని చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. పదేళ్ల క్రితం కూల్చివేయడానికి బుల్ డోజర్లు బయలుదేరినా.. ఎన్ కన్వెన్షన్ వద్దకు చేరకుండానే వెనుదిరిగిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. హై ప్రోఫైల్ వ్యక్తుల ఫంక్షన్లకు ఎన్ కన్వెన్షన్ వేదిక అవుతుంది.
కొండా సురేఖపై న్యాయపోరాటం చేస్తున్న నాగార్జునకు చిక్కులు
ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయో కానీ.. కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. కొండా సురేఖపై ఇప్పటికే రెండు పరువు నష్టం పిటిషన్లను నాగార్జున దాఖలు చేశారు. ఒక దాంట్లో వంద కోట్ల రూపాయలు పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. ఈ లోపే ఆయనపై కేసు నమోదు చేయడం.. కబ్జా చేయడం వల్ల ఆయన సంపాదించినదంతా కట్టించాలన్న డిమాండ్ రావడం ఆసక్తికరంగా మారింది.