ఆ చె౭రువులో మహిళ పడిపోయింది. కానీ మళ్లీ బయటకు రాలేదు. అందరూ కంగారు పడిపోయారు. కాస్త ఈత తెలిసిన వాళ్లను తీసుకొచ్చి ఎక్కడ పడిపోయిందో అక్కడ వెదికారు. ఆమె అక్కడ కనిపించలేదు. ఈ సారి కాస్త పెద్ద ఈతగాళ్లను తీసుకొచ్చి చెరువు మొత్తం వెదికించారు. అయినా కనిపించలేదు. ఒక వేళ మునిగిపోయి బురదలో కూరుకుపోయిందేమో అని చెప్పి పెద్ద పెద్ద మోటార్లను తీసుకచ్చి చెరువులో నీళ్లన్నింటినీ తోడేయించారు. తీరా చూస్తే అక్కడా ఆమె కనిపించలేదు. చివరికి ఆనవాళ్లు కూడా కనిపిచంలేదు. తమ కళ్ల ముందు చెరువులో పడిపోయిన మహిళ ఏమయిపోయిందా అని అందరూ టెన్షన్ పడుతూ గడిపారు. రెండు రోజుల తర్వాత ఆమె నింపాదిగా నడుచుకుంటూ గ్రామంలోకి వచ్చారు. అసలేం జరిగింది ? చెరువులో పడిన మహిళ బయటకు ఎలా వెళ్లింది ? రెండు రోజుల పాటు ఎందుకు ఆజ్ఞాతంలోకి వెళ్లింది ? ఇవన్నీ డౌట్సే.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గోరుమను పల్లె గ్రామానికి చెందిన పది మంది మహిళలు ఆటోలో తుమ్మలపెంట గ్రామంలోని సుంకులమ్మ దైవ దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మహిళలందరూ సమీపంలోని కుంటలోకి దిగారు. అయితే రసూల్ బి అనే మహిళ ప్రమాదవశాత్తు కాలుజారి కుంటలో పడి గల్లంతయింది. కుంటలో పడిన మహిళ కోసం ఎంత గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో మోటార్ల సహాయంతో నీటిని మొత్తాన్ని బయటికి పంపారు. అయినప్పటికీ కుంటలో మహిళ ఆచూకీ లభించలేదు. అప్పటికే విషయం తెలిసి పోలీసులు వచ్చారు. నీటిలో పడిన మహిళ ఎలా అదృశ్యం అవుతుందని పోలీసులు ఇతర మహిళల్ని కాస్త గట్టిగా నిలదీశారు. కానీ వారికీ ఏం చెప్పాలో తెలియలేదు. ఇలా రెండు రోజులు గడిచింది.. పోలీసులూ వదిలి పెట్టలేదు.
రెండు రోజుల తర్వాత గల్లంతైన మహిళ రసూల్ బి రెండు రోజుల అనంతరం ప్రత్యక్షం అయింది. దీంతో పోలీసులే కాదు అందరూ షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే రసూల్ బి కుంటలోనే గల్లంతయిందని ఆమె భర్త శ్రీనివాసులు, కూతురు, బంధువులు శోకాండాలుపెడుతూ అందర్నీ నమ్మించారు. కానీ ఆమె బతికే ఉంది. కుంటలో పడితే ఎలా బయటకు వెళ్లావు ? రెండు రోజుల వరకూ ఏం చేశావు ? అని ప్రశ్నిస్తే రసూల్ బీ పొంతన లేని సమాధానాలు చెబుతోంది. మతి స్థిమితం లేనట్లుగా వ్యవహరిస్తోంది. కుటుంబసభ్యులూ నోరు తెరవడం లేదు.
అయితే రసూల్ బీ కుంటలో పడి చనిపోయిందని నమ్మించాడనికి ఆ కుటుంబం ఉద్దేశపూర్వకంగా డ్రామా ఆడిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అలా ఎందుకు చేశారో పోలీసులు ఆరాతీస్తున్నారు. అయితే అందరూ నటనలో పండిపోయినట్లుగా ఎవరికి వారు నటించేస్తూడటంతో పోలీసులకూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ ఆ మిస్టరీ ఏంటో బయటకు తీయాలని ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు.