ఆధునికత పెరిగిపోయి ఆన్‌లైన్లోనే అన్నీ చక్కబెడుతున్న ఈ కాలంలో ఇంకా ఫేక్ బాబాలు స్వైర విహారం చేస్తున్నారు. నకిలీ బాబాలు, స్వామీజీల లీలలు గతంలో ఎన్నో వెలుగు చూసినా ఇంకా ప్రజల్లో మార్పు రాకపోవడం విస్మయం కలిగిస్తోంది. దొంగ బాబాలు చేసే మ్యాజిక్కులు, గారడీలు, మాయల గురించి జన విజ్ఞాన వేదిక సభ్యులు సైతం ఎంతో అవగాహన కల్పిస్తుంటారు. అయినా ఇంకొన్ని మారుమూల గ్రామాల్లో ఇలాంటి బాబాలను నమ్మి మోసపోతున్న ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. చివరికి చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇలాంటి బాబాలు జనాల్ని నమ్మించి, అమాయకుల్ని తమ బుట్టలో వేసుకుంటున్నారు.
తాజాగా నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో నకిలీ బాబా వ్యవహారం వెలుగు చూసింది. అతను బీటెక్ చదివి కూడా ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ‘‘అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అమావాస్య, పౌర్ణమి నాడు రండి.. ప్రత్యేక పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తా’’ అంటూ నమ్మబలికేవాడు. అమాయకుల మూఢ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న ఇతని లీలలు బయటికి రావడంతో ఈ బురిడీ బాబాను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: Nalgonda: పూడ్చిన శవాన్ని తవ్వి తీసి పడేశారు.. రోడ్డుపై శవపేటిక, నల్గొండలో అమానవీయ ఘటన
నిందితుడు విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అజ్మాపురంలో ఏకంగా పది ఎకరాల స్థలంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ భక్తుల నుంచి రూ.కోట్లు దండుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇతని వ్యవహారం చూసి పోలీసులు కూడా కంగుతిన్నారు.
మహిళ ఫిర్యాదుతో అంతా బయటికి..
బురిడీ బాబాను నమ్మిన భక్తుల్లో మోసపోయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సమస్యలు తీరుస్తానని సాయి విశ్వ చైతన్య నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించాడని ఓ బాధిత మహిళ వాపోయింది. దీంతో జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించారు. ఆశ్రమంలో ఉన్న సాయి విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నగదు, బంగారు ఆభరణాలు, విలువైన డిపాజిట్ బాండ్లు, ల్యాప్ టాప్‌లు, ప్రవచన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గత ఆరు నెలలుగా బురిడీ బాబా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
Also Read: Cyberabad Police Update: సైబరాబాద్ పోలీస్ భలే కాంటెస్ట్.. ఎంపికైతే నగదు బహుమతులు, థీమ్ ఏంటంటే..