Delhi Rains: 


డ్రైవర్ మృతి..


ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. చాలా చోట్ల గుంతలు పడుతుండటం వల్ల వాహనదారులు నరకం చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గుంతల్ని మట్టి పోసి నింపుతున్నారు. అయినా వానలు కురవడం వల్ల ఆ మట్టి కొట్టుకుపోయి ప్రమాదాలకు దారి తీస్తోంది. హర్ష్ విహార్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌ గుంతలో పడిపోయాడు. ఆటోలో వస్తుండగా గుంత కనిపించలేదు. ఉన్నట్టుండి ఆటో అందులో పడిపోయింది. అందులో నుంచి 51 ఏళ్ల డ్రైవర్ కూడా జారి పడ్డాడు. వాన నీటితో నిండిపోయిన ఆ గుంతలో పడిపోయాడు. అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని అధికారులు గుంత తవ్వారు. పిల్లర్ ఇన్‌స్టాల్ చేసేందుకు దాన్ని అలాగే వదిలి పెట్టారు. ఇంతలో వర్షాలు కురవడం వల్ల మట్టి పోసి వదిలేశారు. రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ గుంత నిండిపోయింది. అది చూసుకోకుండా వెళ్లిన ఆటోడ్రైవర్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై PWD అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై డీసీపీ స్పందించారు. 


"మధ్యాహ్నం 3.30 నిముషాలకు మాకు కాల్ వచ్చింది. వజీరాబాద్‌ రోడ్‌కి పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్‌లో గుంతలో ఓ డ్రైవర్ పడిపోయాడని చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తవ్విన గుంత అది. ఆలోతు అంచనా వేయలేక  చిన్న గుంతే కదా అని నేరుగా అందులోకి వెళ్లిపోయాడు. ఆటో ఇరుక్కోగానే అందులో నుంచి బయటపడాలని చూశాడు. కానీ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. చాలా సేపటికి ఆయన డెడ్‌బాడీ బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యులెవరూ లేరు. పోస్ట్‌మార్టం ముగిశాక డెడ్‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం. దీనిపై విచారణ కొనసాగుతోంది"


- జాయ్ టిర్కీ, డీసీపీ 






ట్రాఫిక్‌కి అంతరాయం..


భారీ వర్షాల కారణంగా దేశ రాజధానిలో పరు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనిపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. నగరంలో ఇంత జరుగుతున్నా ఆప్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోడం లేదని, ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే చూస్తూ ఉండిపోతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అలా వానలు పడ్డాయో లేదో అప్పుడే రోడ్లన్నీ జలమయం అయ్యాయని అసహనం వ్యక్తం చేస్తోంది. 


"ఢిల్లీ సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నీళ్లు వచ్చాయి. ఇక్కడ రోడ్లు కూడా జలమయం అయ్యాయి. ఓ ఆటోడ్రైవర్ అకారణంగా చనిపోయాడు. ఢిల్లీ ప్రజలంతా ఈ వార్తలు విని ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఢిల్లీ డ్రెయిన్‌లు శుభ్రం చేయడంలోనూ పెద్ద స్కామ్‌ జరిగిందన్న అనుమానాలున్నాయి. జనాల అవస్థలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులదే బాధ్యత. "


- బీజేపీ 


దాదాపు 2 దశాబ్దాల తరవాత ముంబయి, ఢిల్లీలో ఒకేసారి వానలు కురుస్తున్నాయి. అంతకు ముందు ఈ రెండు నగరాల్లోనూ బిపోర్‌జాయ్ ఎఫెక్ట్ కనిపించింది. ఆ తరవాత రుతుపవనాలు రావడంతో భారీ వర్షాలు కురవడం మొదలైంది. 


Also Read: Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్ - సౌత్ ఈస్టర్న్ రైల్వే జీఎంపై బదిలీ వేటు