karimnagar Crime News :  వయసులో ఉన్నప్పుడు ప్రేమలన్నీ నిజమనుకుంటారు . ఎవరైనా ప్రేమిస్తున్నానని వెంట పడితే సరే అంటారు. కానీ అన్నీ కోల్పోయిన తర్వాతే కళ్లు తెరుస్తారు. అప్పుడు చేయడానికేమీ ఉండదు. ధర్నాలు చేసుకోవడం తప్ప. జీవితంలో తప్పులు దిద్దుకోవడానికి కూడా ఉండదు. అలాంటి పరిస్థితే ఎదురైంది ప్రేమికురాలు దుర్గారెడ్డికి. ఇప్పుడామె తనకు న్యాయం చేయాలని మోసగించిన ప్రియుడి ఇంటి ముందు ధర్నాలు చేస్తోంది. 


తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని కాదని ప్రేమ కోసం వెళ్లిపోయిన దుర్గ


 శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది. ఆ సమయంలో   ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పని చేస్తున్న కరీంనగర్‌కు చెందిన  ఫారూఖ్‌ అలీ అనే వ్యక్తితో  పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ విషయం తెలిసిన దుర్గారెడ్ తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి తో దుర్గారెడ్డి పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. అయితే దుర్గా రెడ్డి మాత్రం ప్రేమ కోసం త్యాగం చేస్తున్నానని అందర్నీ వదిలేసుకుని వెళ్లిపోయింది.  


డబ్బులన్నీ అయిపోయిన తర్వాత తెలిసిన అసలు నిజం 


ఫారూఖ్‌ మతం మార్చుకుని దుర్గారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. అయితే  దుర్గ తెచ్చిన డబ్బులు అయిపోయాయి. తర్వాత దుర్గ వద్దకు వచ్చిన ఆమె అమ్మమ్మ రూ.3 లక్షలు ఇచ్చింది. వాటిని కూడా ఫారూఖ్‌ సొంతానికి వాడుకున్నాడు. తన చెల్లెలికి కరోనా వచ్చి, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని దుర్గ నగలు తాకట్టుపెట్టి, డబ్బు తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేసిన తర్వతా ఫారుఖ్ మెల్లగా ఇంటికి రావడం తగ్గించాడు. తర్వాత విషయం ఆరా తీస్తే దుర్గారెడ్డికి కళ్లు తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. అప్పటికే  ఫారూఖ్‌కు పెళ్లయిన విషయం బయటపడింది. పిల్లలు కూడా ఉన్నట్లు తెలియడంతో నిలదీ సింది. అయిపోయిందేదే అయిపోయింది.. అందరం కలిసి ఉందామన్నాడు. ఆమె సర్దుకుపోయింది.


 న్యాయం కోసం కరీంనగర్‌లో ప్రియుడి ఇంటి ముందు ధర్నా


అయితే తర్వాత కూడా డబ్బు కోసం ఫారూఖ్‌తోపాటు అతని మొదటి భార్య దుర్గను వేధించడం మొదలు పెట్టారు. తాను పని చేస్తున్న కంపెనీని కూడా అతను మోసం చేయడాన్ని గమనించిన దుర్గారెడ్డి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీవారు ఫారూఖ్‌పై దాడి చేశారు. దీంతో కోపం పెంచుకున్న భర్త, అతని మొదటి భార్య పలుమార్లు ఆమెపై దాడి చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఫారూఖ్‌ మరింత రెచ్చిపోయాడు. దుర్గను వదిలేసి కరీంనగర్‌కు మకాం మార్చాడు. అయితే  అలుగునూర్‌కు వచ్చి ఉంటున్నట్లు దుర్గ తెలుసుకుంది. అతడి కోసం కరీంనగర్‌ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మంగళవారం అతని ఇంటి ఎదుట నిరసన తెలిపింది. బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం బాధితురాలు ఎల్‌ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.