హైదరాబాద్: ఇంటి నుంచి పని చేస్తే చాలు. రోజుకు గంట కష్టపడితే.. వేలల్లో సంపాదించుకోవచ్చు. విద్యార్థులు, గృహిణిలు... అందరూ అర్హులే. కంప్యూటర్‌, మొబైల్‌ ఉంటే చాలు. ఎక్కడి నుంచి అయినా పనిచేసుకోవచ్చు. విద్యార్హతలు పెద్దగా అవసరం లేదు.  తాము పంపే వీడియోలకు లైక్‌లు ఇవ్వడం... రివ్యూలు రాయడం చేస్తే చాలు. ఇలాంటి మెసేజ్‌లు మీకూ వస్తున్నాయా...? ఒక్కసారి ట్రై చేస్తే తప్పేముంది... అదనపు ఆదాయం వస్తుంది... ఆర్థిక కష్టాలు తీరిపోతాయని అని అనుకుంటున్నారా.  అయితే ఒక్క క్షణం ఆగండి. మీలాంటి వారే వారి టార్గెట్‌. వారి మాటలు నమ్మి.. ఒక్క అడుగు ముందుకు వేసినా... మీరు వారి బుట్టలో పడిపోయినట్టే. ఇది.. సైబర్‌ క్రైమ్‌ పోలీసు అధికారులు చెప్తున్న మాట. 


వర్క్‌ ఫ్రమ్‌ హోం అంటూ మభ్యపెడుతున్నారు 
సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ పేరుతో.. వల వేస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం అంటూ మభ్యపెడుతున్నారు. కష్టాల్లో ఉన్న వారిని టార్గెట్‌ చేసి... వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సింపుల్‌ వర్క్‌ అంటూ మాయ చేసి.. వారి  వైపు దృష్టి మళ్లించుకుంటున్నారు. ఇచ్చిన వీడియోలు లైక్‌ చేస్తే చాలంటారు. లింక్స్‌ పంపి వాటిని క్లిక్‌ చేస్తే సరిపోతుందని చెప్తారు. అంతేకాదు.. అంతర్జాతీయ కంపెనీలకు రివ్యూ రాయడమే మీ టాస్క్‌ అని అంటారు. ఇదేదో బాగుంది కదా అని  వారిని సంప్రదించే... వర్క్‌ ఇవ్వాలంటే కొంత డబ్బు కట్టాలంటారు. డబ్బు కట్టించుకుని లిమిటెడ్‌ లింక్స్‌ ఇస్తారు. ఒకటి, రెండు చేసిన వారు... ఇంకా ఎక్కువ సంపాదించాలన్న ఆశతో... ఎక్కువ లింక్స్‌ కోసం... మరింత పెట్టుబడి పెడతారు. ఇదే...  సైబర్‌ నేరగాళ్ల పన్నుతున్న వల. వారు అనుకున్నంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు రాగానే... మాయమైపోతారు. తాజాగా...హైదరాబాద్‌లో ఇలాంటి మోసమే ఒకటి బయటపడింది. పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడి 26 కోట్లకు  కుచ్చుటోపీ పెట్టారు సైబర్‌ కేటుగాళ్లు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.... నిందితుల కోసం గాలించారు. ఇద్దరు కేటుగాళ్లు కేరళలో ఉన్నట్టు తెలుసుకుని... అక్కడికి వెళ్లి అరెస్ట్‌ చేశారు. ఆ  ఇద్దరినీ హైదరాబాద్‌ తీసుకొచ్చారు. 


సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత ఏమన్నారంటే..
సైబర్‌ కేటుగాళ్లు... టెలిగ్రామ్ ద్వారా పార్ట్‌టైమ్‌ జాబ్స్ పేరుతో మోసం చేసినట్టు విచారణలో గుర్తించామన్నారు డీసీపీ కవిత. ఈ సైబర్‌ ముఠా... ముందుగా సోషల్ మీడియాలో లైక్స్ చేయడం, రివ్యూలు రాస్తే మీకు డబ్బులు ఇస్తామని నమ్మించింది.  ఆ తర్వాత పెట్టుబడులు పెడితే... ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుందని కబుర్లు చెప్పింది. వారి మాటలు నమ్మి... కొంత మంది 9 లక్షల 44 వేల రూపాయల వరకు ఇన్వెస్ట్‌చేశారు. అంత డబ్బు పోగైన తర్వాత... వీరు ఫోన్‌ నెంబర్లు బ్లాక్ చేశారు.  దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు... సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని డీసీపీ కవిత తెలిపారు. ఈ కేసులో టెక్నాలజీ సాయంతో లోతుగా దర్యాప్తు చేసి... ఇద్దరు నిందుతులను కేరళలో అరెస్ట్‌ చేశామని చెప్పారు.  స్కామ్‌ మొత్తం దుబాయ్‌ నుంచి జరుగుతోందని విచారణ గుర్తించామని చెప్పారు. ఎంతో మందిని మోసం చేసిన దోచుకున్న డబ్బులన్నీ.... దుబాయ్‌లోని అకౌంట్స్‌కే వెళ్తున్నాయని చెప్పారు. కమిషన్‌ ఇస్తామని చెప్పి... అమాయకుల బ్యాంక్  అకౌంట్స్‌ని కూడా ఈ ముఠా వాడుకుందని తెలిపారు డీసీపీ కవిత. మొత్తం... 18 అకౌంట్ల ద్వారా.... 26 కోట్ల రూపాయలు ట్రాన్సక్షన్ జరిగిందని చెప్పారు. ఆ అకౌంట్స్ నుంచి నగదును... క్రిప్టో ద్వారా వివిధ దేశాలకు పంపించారని సైబర్ క్రైం డీసీపీ  కవిత వెల్లడించారు. 


సో... జాగ్రత్తగా ఉండండి. అదనపు సంపాదన అవసరమే... కానీ.. అందుకోసం... ఎవరు ఏం చెప్పినా నమ్మేయకూడదు. ఏమరుపాట అసలే ఉండకూడదు. అన్నీ పరిశీలించుకుని.. కంపెనీ గురించి తెలుసుకుని... అడుగు ముందుకు వేయాలి. ఏది  అసలైన కంపెనీ... ఏది ఫేక్‌ అన్నది గుర్తించగలగాలి. అప్పుడే సైబర్‌ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చు.