Crime News: సభ్య సమాజం తలదించుకునే ఘటన యూపీలో జరిగింది. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఖాకీలు కీచకుల్లా మారారు. ప్రజల ధన, ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు రాక్షసుల్లా మారారు. ప్రజల మానాలు కాపాడాల్సిన పోలీసులు అత్యంత నీచంగా ప్రవర్తించారు. త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంట ఒంటరిగా ఉండడం చూసి దారుణానికి ఒడిగట్టారు. జంటను బెదిరించి వారి వద్ద డబ్బు, నగదు దోచుకున్నారు. అంతటితో ఆగలేదు. నీతి, నియమాలు మరిచి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. రక్షకులుగా ఉండాల్సిన వారు రాక్షసుల్లా ప్రవర్తించారు. ఖాకీలకు మాయని మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు.


యూపీలోని ఘాజియాబాద్‌ (Ghaziabad)లో త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు వేధింపులకు గురిచేశారు. సరదాగా సమయం గడిపేందుకు వెళ్లిన ఆ జంట నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా.. యువతిని లైంగికంగా వేధించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బులంద్‌షహర్‌కు చెందిన ఓ జంట ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ క్రమంలోనే సరదాగా గడిపేందుకు పార్క్‌కు వెళ్లారు. ఇంతలో వారి వద్దకు ముగ్గురు పోలీసులు వచ్చారు. వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. 


తప్పు చేశారని, జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ జంటను సదరు పోలీస్ కీచకులు బెదిరించారు. జైలుకు వెళ్లకుండా ఉండేందుకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమని వదిలేయమంటూ ఆ జంట పోలీసుల కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదు. యువకుడి నుంచి డబ్బును బలవంతంగా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. అంతటితో సరిపెట్టుకోలేదు. ఇచ్చిన డబ్బు సరిపోవంటూ బెదిరింపులకు దిగారు. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అంతటితో ఆగలేదు. యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. తరచూ యువతికి ఫోన్‌ చేసి వేధింపులకు పాల్పడేవారు. అంతే కాకుండా యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి కూడా వచ్చేవారు. అసభ్యకరంగా ప్రవర్తించేవారు. 


పోలీసుల వేధింపులు తాళలేని ఆ జంట తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి నిందితుడితో ఫోన్లో జరిపిన సంభాషణను సాక్ష్యంగా చూపింది. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసిన వివరాలు అన్నీ అందించి తనకు జరిగిన దారుణాన్ని వివరించి బోరుమంది. న్యాయం చేయాలని వేడుకుంది. దీంతో ఆ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు రాకేశ్‌ కుమార్‌, దిగంబర్‌ కుమార్‌గా గుర్తించారు. మూడో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.  నిందితులు ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు తెలిపారు.