ప్రకాశం జిల్లా.. ముండ్లమూరు గ్రామానికి చెందిన నారాయణమ్మ, ఆమె భర్త దండపాణి ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2010లో బతుకుదెరువు కోసం చిత్తూరు జిల్లా పీలేరుకి చేరుకున్నారు. ఆ దంపతులు ఏల్.బి.ఎస్ రోడ్డులోని ఎస్.బి.ఐ స్టేట్ బ్యాంక్‌ ఎదురుగా ఏ టూ జెడ్ బిగ్ బజార్ పేరిట సూపర్ మార్కెట్ తరహాలో పెద్ద దుకాణాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా ప్రజలతో‌ ఎంతో నమ్మకస్తులుగా మెలిగారు. దుకాణానికి వచ్చిన వారితో మంచిగా ప్రవర్తిస్తూ పరిసర ప్రాంతాల గ్రామాల వారితో పరిచయాలు పెంచుకున్నారు.  తమ పేరిట స్థానిక ఆంధ్రా బ్యాంకులో 85 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ ఉందని అందరిని నమ్మించారు. 


ఈ డబ్బుతో  వడ్డీ వ్యాపారం చేయనున్నట్లు నమ్మించారు.  అధిక వడ్డీ ఇస్తామని చుట్టుపక్కల వారిని నమ్మించి.. వారి వద్ద నుంచి నగదు తీసుకున్నారు. అయితే వారికి షూరిటీగా బ్యాంకు చెక్కులు, ప్రామిసరీ నోట్లు సైతం రాసి ఇచ్చారు. దీంతో నారాయణమ్మ దంపతులను మరి‌కొందరికి పరిచయం చేసి వారి వద్ద నుంచి కూడా నగదును ఇప్పించారు అక్కడి వాళ్లు.  మొదట్లో‌ తీసుకున్న నగదుకు ఎటువంటి అనుమానం రాకుండా సమయానికి వడ్డీ కడుతూ వచ్చే వారు. కార్లలో తిరుగుతూ హై ప్రొఫైల్ లేడీగా నారాయణమ్మ కలరింగ్ ఇచ్చేది. దీంతో చుట్టు పక్కల వారు నారాయణమ్మ దంపతులను మరింతగా నమ్మారు. 


ఏ చిన్న కార్యం జరిగినా నారాయణమ్మ దంపతులు‌ ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నట్లు నమ్మించారు. ఇలా కొద్ది రోజుల పాటు సాగింది.. అయితే స్థానికంగా ఉన్న వారి వద్ద కొంత మొత్తంలో నగదు అవసరం ఉందని, బంగారం కావాలని బ్యాంకులో‌ కుదువ పెట్టి గడువులోగా తిరిగి ఇప్పించేస్తామని నమ్మించారు. నారాయణమ్మ దంపతులపై బాగా నమ్మకం ఉండడంతో బంగారు నగలను ఇచ్చారు కొంతమంది. రోజులు గడుస్తున్నాయి..నెలలు గడుస్తున్నాయి..కానీ తాము ఇచ్చిన నగలు మాత్రం ఇవ్వక పోయే సరికి బాధితులు నారాయణమ్మ దుకాణం వద్దకు వెళ్లి గట్టిగా నిలదీశారు. 


కొంత మొత్తంలో నగదు బయటి వారికి ఇచ్చి మోసపోయామని ఆ నగదు రాగానే‌.. ఇవ్వాల్సిన నగలు, నగదు తిరిగి చెల్లిస్తామని నమ్మబలికారు. కొద్ది రోజుల పాటు‌ బాధితులు ఏం అడకుండా.. సైలెంట్ ఉన్నారు. తీసుకున్న నగదుకు అసలు, వడ్డీ ఇవ్వక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు నారాయణమ్మ దంపతులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో 2019లో నారాయణమ్మ దంపతులు రుణదాతలకు తెలియకుండా పీలేరు నుంచి రాత్రికి రాత్రి పరార్ అయ్యారు. వడ్డీతో పాటు నగదు చెల్లిస్తామని హామీ ఇచ్చిన గడువు పూర్తి కావడంతో రుణదాతలు నారాయణమ్మ దుకాణం వద్దకు వెళ్ళారు. దుకాణానికి తాళం వేసి ఉండడం చూసి నారాయణమ్మ నివాసం వద్దకు వెళ్ళారు. అక్కడ కూడా ఎవరూ లేరు. దీంతో డబ్బు ఇచ్చిన వాళ్లంతా.. ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఫోన్ ద్వారా సంప్రదించాలని చూసిన ఫలితం కనిపించకపోయే సరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 


బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నారాయణమ్మ దంపతుల కోసం గాలింపు చర్యలు చేశారు. కానీ వారి ఆచూకీని మాత్రం పోలీసులు గుర్తించలేక పోయారు.  పీలేరు నుంచి అదృశ్యమైన నారాయణమ్మ దంపతులు తూర్పుగోదావరి జిల్లా,  తణుకులో ఎవరి కంట పడకుండా ఉంటూ వచ్చారు. రెండు రోజుల క్రితం పీలేరుకు వచ్చి షాప్ లోని సరకులు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పసిగట్టి నారాయణమ్మ దంపతులను అదుపులోకి‌ తీసుకున్నారు. కోటి రూపాయలకు పైగా అప్పు చేసి ఉడాయించిన దంపతులు రెండున్నర ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 1.40 లక్షల రూపాయల నగదు, దాదాపుగా 230 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణమ్మ దంపతులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.


Also Read: Tirumala Red Sandal: తిరుమల ఘాట్‌రోడ్‌లో పుష్ప సీన్.. ఎర్ర స్మగ్లర్లను ఛేజ్ చేసిన టాస్క్‌ఫోర్స్..! చివరికి ఏమయిందంటే ?


Also Read: Vizianagaram News: తనిఖీల పేరుతో అసభ్యకర చర్యలు... పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు