జగనన్న  పాల వెల్లువ కార్యక్రమంపై తెలుగు దేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. తామేదో పాపం చేసినట్లు, అమూల్ కి సంపద దోచి పెట్టినట్లు  మాట్లాడుతున్నారన్నారు. అమూల్ అనేది ప్రైవేట్ సంస్థ కాదని, సహకార సంస్థ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉన్న  సహకార సంస్థలన్నింటినీ చంద్రబాబు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చేశారని విమర్శించారు. పాడి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంగం డైరీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. ప్లాన్ ప్రకారం మాక్స్ యాక్ట్ లో ధూళిపాళ్ల కుటుంబానికి అనుకూలంగా మార్చారన్నారు. సహకార సొసైటీలకు ఇచ్చినట్లే గ్రామ స్థాయిలో  మహిళా సొసైటీలకు ఆస్తుల ఇస్తామన్నారు. అమూల్ సంస్థ ఈ సొసైటీలకు మార్కెటింగ్ మాత్రమే చేస్తుందన్నారు. సంగం, హెరిటేజ్ డెయిరీలను కోఆపరేటివ్ లుగా మార్చాలని ఛాలెంజ్ చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్రకు సీఎం జగన్ ను విమర్శించే  అర్హత లేదన్నారు. 


Also Read: దండాలయ్యా.. దండాలయ్యా..! నీ సింప్లిసిటీకి ఏమనాలయ్యా!


సీఎం జగన్ అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ : ధూళిపాళ్ల నరేంద్ర


లీటరు పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఎందుకు ఇవ్వడంలేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పాడి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ అమూల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. పాడి రైతుల సహకార సొసైటీల మూసివేతకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఏపీలోని పాల డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు డెయిరీ మూతపడినా పట్టించుకోని సీఎం జగన్... అమూల్‌ కోసం రూ.2,500 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. నెల్లూరు డెయిరీని ఎందుకు కాపాడడంలేదని ధూళిపాళ్ల నిలదీశారు. 


Also Read: వరి వద్దు.. రొయ్యల సాగు చేయండి ..రైతులకు ధర్మాన సలహా !


మిల్క్ డెయిరీల నిర్వీర్యం


రాష్ట్రంలో 30 వేల మంది రైతుల నుంచి 168 లక్షల లీటర్ల పాలను అమూల్‌ సంస్థ సేకరిస్తుందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అమూల్‌ సంస్థ లీటరు పాలకు రూ.42.50 పైసలు చెల్లిస్తుంటే.. సీఎం జగన్ రూ.70 అని అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. విజయడెయిరీ 11 శాతం వెన్న ఉన్న లీటరు పాలకు రూ.85.55 పైసలు ఇస్తుంటే, అమూల్‌ సంస్థ కేవలం రూ.77 ఇస్తుందన్నారు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా అమూల్‌ డెయిరీ రాష్ట్రంలో వ్యాపారం చేస్తుందన్నారు. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ సహా రాష్ట్రంలోని మిల్క్‌ డెయిరీలను నిర్వీర్యం చేయాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు. 


Also Read:  రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి