Palamaner Priest Escape: కుటుంబ అవసరాలతో పిల్లల ఉన్నత చదువులకో, సొంత ఇంటి కల నేరవేర్చుకునేందుకో సామాన్య ప్రజలు డబ్బులు దాచుకునేందుకు చిట్టీలు వేస్తారు. సామాన్యుల ఆశలను కొందరు అవకాశంగా మలచుకుని చిట్టీల పేరుతో డబ్బులు కట్టించుని ఉన్నఫళంగా ఉడాయిస్తున్నారు. రేయింబవళ్ళు కాయకష్టంతో దాచుకున్న డబ్బు తమకు భవిష్యత్తు అవసరాలకు ఉంటుందని అనుకున్న సొమ్ము ఖాళీ కావడంతో సామాన్యులకు కష్టాలు మిగులుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓంశక్తి ఆలయంలో పూజారిగా నమ్మించిన భక్తులకు మాలలు ధరిస్తూ ఎంతో నమ్మకం కల్పించి చిన్న చిన్న చిట్టీ వ్యాపారం వేస్తూ ఉన్నట్లుండి డబ్బుతో ఉడాయించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళ్ళితే.. చిత్తూరు జిల్లా, బంగారు పాళ్యంకు చెందిన ఆంజనేయులు చౌదరి స్థానికంగా ఉన్న ఓంశక్తి అమ్మవారి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. ఆలయానికి వచ్చే భక్తులతో ఎంతో మర్యాద పూర్వకంగా మెలిగేవాడు. దీంతో స్థానికంగా అందరికి ఆంజనేయులు అంటే ఎంతో నమ్మకం కలిగింది. ఏ కార్యక్రమం జరిగినా ఆంజనేయులు కచ్చితంగా హాజరు అయ్యేవారు. ఇలా కొద్ది రోజుల పాటు స్థానికంగా ఉన్న వారికే కాదు. బయటి ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారి మాలలు ధరించే వారికి ఎంతో నమ్మకం కల్పించాడు. దీంతో అమ్మవారి యాత్ర పేరుతో ఆంజనేయులు చిన్న చిన్న చిట్టీలు వేయడం ప్రారంభించాడు. ఆలయానికి వచ్చే భక్తుల వద్ద యాత్రకు సంబంధించిన చిట్టీలు వివరాలు తెలిపి వారి వద్ద చిట్టీలు కట్టించేవాడు. ఇలా ఒకరి ద్వారా మరొకరికి తెలిసి ఆలయానికి వచ్చే వారే కాకుండా స్థానికంగా ఉండే నివాసితులు కూడా యాత్రకు చిట్టీలు వేశారు.
నమ్మకంగా ఉండే వ్యక్తి కావడం, అందులోనూ ఆలయ పూజారి కావడంతో అందరికి ఆంజనేయులుపై విపరీతం నమ్మకం కలిగింది. దీంతో ఆంజనేయులు చౌదరి యాత్ర చిట్టీలు పక్కన పెట్టి, నెల నెలా నగదు కట్టే చిట్టీలు ప్రారంభించాడు. ఆంజనేయులు స్థానికుడు కావడంతో నివాసితులు చిట్టీలు వేశారు. ఇలా 20 లక్షల వరకు చిట్టీలు నిర్వహించే స్థాయికి ఆంజనేయులు ఎదిగాడు. అంతేకాకుండా నివాసితులకు అధిక వడ్డీ ఆశ చూపి భారీ స్థాయిలో సొమ్ము వసూలు చేశాడు. కొద్ది రోజుల వరకు తీసుకున్న సొమ్ముకు నెల నెల వడ్డీలు కడుతూ నమ్మకంగా ఉన్న ఆంజనేయులు చౌదరి గత వారం రోజుల క్రితం రాత్రికి రాత్రే ఉడాయించాడు.
ఆలయానికి మూడు నాలుగు రోజులుగా తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆంజనేయులు ఇంటి వద్దకు వెళ్లారు. కానీ ఆంజనేయులు ఇంటి వద్ద లేకపోవడంతో పని మీద బయటకు వెళ్లి ఉంటాడని నమ్మి బాధితులు అనుకున్నారు. కానీ ఎంతకీ ఆంజనేయులు చౌదరి తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచాఫ్ రావడంతో అనుమానం వచ్చిన బాధితులు స్థానికంగా ఉన్న ఆంజనేయులు బంధువులను ఆరా తీశారు. అయితే ఆంజనేయులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని అని బంధువులు చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆంజనేయులు నివాసం ఉండే ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు తాళాలు బద్దలు కొట్టి ఇంటిలోకి ప్రవేశించారు. ఇల్లు మొత్తం పూర్తిగా ఖాళీ అయి ఉండటం గమనించిన బాధితులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
తమ వద్ద అధిక వడ్డీ ఆశ చూపి నగదు తీసుకుని పరారైనట్లు బాధితులు గ్రహించి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆంజనేయులు చౌదరి కోసం గాలిస్తున్నారు. అయితే ఆంజనేయులు పరారయ్యాడని తెలుసుకున్న బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆంజనేయులు చిట్టీలు వేసే ప్రాంతాలను ఆరా తీశారు. దీంతో దాదాపు 250 మందికి పైగా బాధితులకు కుచ్చుటోపీ పెట్టి ఆంజనేయులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 25 లక్షలకు పైగా ఆంజనేయులు చౌదరి చిట్టీల వ్యాపారం పేరుతో సొమ్ము వసూలు చేసి రాత్రికి రాత్రి పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పలమనేరు డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో ఆంజనేయులు చౌదరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయ పూజారి నమ్మిన తమకు నట్టేట ముంచేశాడని బాధితులు బోరు మంటున్నారు.