Hyderabad News: జాతీయ రాజకీయాలు లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి ముంబయి పర్యటనలో ఆసక్తికరంగా నటుడు ప్రకాశ్ రాజ్ కనిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ముంబయిలో హోటల్‌కు వెళ్లినప్పటి నుంచి అక్కడ జరిపిన సమావేశాలు, తిరిగి పయనం అయ్యే వరకూ ప్రకాశ్ రాజ్ వారితోనే ఉన్నారు. ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ ప్రత్యేకమైన నాయకులతో కొత్త బృందాన్ని రూపొందిస్తున్నారు. ఆ టీమ్‌లో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ముంబయి పర్యటన సందర్భంగానే ఈ విషయంలో బలమైన సంకేతాలు వచ్చాయి.
కేసీఆర్ ముంబయి పర్యటనలో నటుడు ప్రకాశ్ రాజ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ముందు నుంచి బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పే సంగతి అందరికీ తెలిసిందే. బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్య తర్వాత కేంద్రం తీరును ప్రకాశ్ విపరీతంగా తప్పుబడుతూ వస్తున్నారు. అదే సమయంలో చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీపై మక్కువ చూపారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం గురించి ప్రస్తావించారు. వారు డైనమిక్ లీడర్స్ అంటూ కొనియాడేవారు.
అంతేకాక, ప్రకాశ్ రాజ్‌కు జాతీయ రాజకీయాలపై అవగాహన ఉండడం, ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషలపై మంచి పట్టు ఉన్నందున ఆయన సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జాతీయ రాజకీయాల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ బృందంలో ఆయనకు చోటు కల్పించవచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ తరపున ఆయనకు రాజ్యసభ స్థానానికి కూడా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.
త్వరలో తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. వాటిలో ఒక స్థానంలో ప్రకాశ్ రాజ్‌కు కేటాయిస్తే, జాతీయ స్థాయిలో కమలం వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బండ ప్రకాశ్ రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉండగా, జూన్‌లో మరో ఇద్దరు డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీకాలం ముగియనుంది. ఎలాగూ ఈ మూడు స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని ప్రకాశ్ రాజ్‌కు ఇచ్చే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.