Chikoti Praveen : చికోటి ప్రవీణ్ పేరుతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో కొన్ని పోస్టులు రెండు , మూడు రోజుల నుంచి వైరల్ అవుతున్నాయి. తన వెనుక పెద్ద పెద్ద నేతలున్నారని .. తనను ఎవరూ ఏమీ చేయరని కొన్ని వ్యాఖ్యలు.. అలాగే తనను ఇరికించాలని చూస్తే అందరి బండారం బయట పెడతానని మరి కొన్ని వ్యాఖ్యలతో పోస్టులు వైరల్ అయ్యాయి. వాటితో కొన్ని రాజకీయ పార్టీలు ట్రోలింగ్ చేస్తున్నాయు. అయితే ఈ అకౌంట్లన్నీ తనవి కాదని చికోటి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. @praveenchikotii పేరుతో ట్విట్టర్ లో నకిలీ ఖాతా తెరిచి.. ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలను ప్రవీణ్ బెదిరిస్తున్నట్టు తప్పుడు పోస్ట్ లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసు లకు ఫిర్యాదు చేశారు.
రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన ప్రవీణ్ చికోటి !
ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ విచారణ సందర్భంగా మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని చికోటి ప్రవీణ్ మండిపడ్డారు. మీడియా సంస్థలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని మీడియాని కోరుతున్నానన్నారు. ఈడీ విచారణలో జరుగుతోంది వేరు.. బయట చేస్తున్న ప్రచారం వేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. వరుసగా రెండో రోజు కూడా ఈడీ విచారణకు చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. అయితే ఆయనతో పాటు హాజరు కావాల్సిన మాధవరెడ్డి మాత్రం హాజరు కాలేదు. ఆయన ఎందుకు హాజరు కాలేదో తనకు తెలియదని.. తన వద్ద సమాచారం లేదని చికోటి ప్రవీణ్ మీడియాకు తెలిపారు.
హవాలా లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లుగా ప్రచారం
గోవాలోని ప్రముఖ క్యాసినో సంస్థలకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న చికోటి ప్రవీణ్ ఇటీవల విదేశాల్లో క్యాసినోలను నిర్వహించారు. ప్రత్యేక విమానాలతో పంటర్లను తీసుకెళ్లి రూ. కోట్ల మేర లావాదేవీలు నిర్వహించారు. అలాగే సంక్రాంతి సందర్భంగా గుడివాడలోనూ కేసినో నిర్వహించారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదులు రావడంతో ఈడీ ఆయనతో పాటు ఆయన వ్యాపార భాగస్వాములపైనా విచారణ జరిపింది. పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
పలువురు రాజకీయ నేతలతో చికోటికి సంబంధాలు
ప్రవీణ్ చికోటితో సంబంధం ఉన్నట్లుగా చాలా మంది రాజకీయ నేతల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. కొంత మంది తమ ప్రమేయం లేదని ఖండిస్తున్నారు. పనిలో పనిగా కొంత మంది ఆయన పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి ఇతరులను బెదిరిస్తున్నట్లుగా పోస్టులు పెడుతున్నారు. దీంతో చికోటి కేసుల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అయితే ప్రవీణ్ చికోటి ఫిర్యాదు చేసిన కాసేపటికే ఆయన పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంటర్ డిలీట్ అయిపోయింది.