చేనేత పనివారు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ఆ పథకం ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ సోమవారం (ఆగస్టు 1)న ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అయితే, ఈ ప్రకటనపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ ద్వారా కౌంటర్లు వేశారు. ప్రగతి భవన్‌లో స్లీపింగ్ బ్యూటీ నిద్ర లేచిందని, ఎట్టకేలకు చేనేత బీమా ప్రకటించారని ట్వీట్ చేశారు. బీజేపీ పదేపదే డిమాండ్ చేయడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఏడాది క్రితం నేతన్న బీమా ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్నే ట్విటర్ టిల్లు దాన్ని రిపీట్ చేశారని అన్నారు. ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు అంటూ, బాధితులకు జవాబుదారి ఎవరు? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.


‘‘స్లీపింగ్ బ్యూటీ ప్రగతి భవన్ లో నిద్ర లేచింది. చేనేత బీమా ప్రకటించింది. తెలంగాణ బీజేపీ ఎన్నోసార్లు అడిగిన తర్వాత ప్రకటించారు. ఏడాది క్రితం ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని ట్విటర్ టిల్లు మళ్లీ ప్రకటించారు. ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు? ఇబ్బందులు పడ్డ బాధితులకు జవాబుదారీ ఎవరు?’’ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.






బండి సంజయ్ చేసిన కౌంటర్ పై కేటీఆర్ స్పందించారు. ‘‘ఎంపీ నుంచి ఈ జోక్ రావడం ఆశ్చర్యంగా ఉంది. సొంత పార్లమెంటు నియోజకవర్గం సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయించలేకపోయారు. బండి సంజయ్ కుమార్ గారూ.. గత 8 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏం చేసిందో చెప్పగలరా? లేదంటే కరీంనగర్ కు ఎంపీగా మీరు చేసిన పని ఏంటో చెప్తారా?’’ అంటూ కేటీఆర్ సమాధానం ఇచ్చారు.