August Month Tragedies in NTR Family: ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలా ఎన్టీఆర్ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. సోమవారం ఆగస్టు 1వ తేదీన ఉదయం ఆమె బలవన్మరణం చెందారు. తన గదిలోనే చున్నీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.


ఎన్టీఆర్ కు ఎంతమంది సంతానమంటే


ఎన్టీ రామారావు ఫ్యామిలీ చాలా పెద్దది. ఎంత పెద్దదంటే.. ఆయనకు ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. మొత్తం 12 మంది సంతానం. అయితే వారిలో మొదటి కుమారుడు రామకృష్ణ పదేళ్ల వయస్సులోనే మసూచి సోకడంతో చనిపోయాడు. తర్వాత ఏడుగురు సంతానం కాగా.. ఏడో కుమారుడికి మళ్లీ రామకృష్ణ అనే పేరే పెట్టారు ఎన్టీ రామారావు. 


కలిసిరాని ఆగస్టు నెల


ఎన్టీ రామారావు కుటుంబానికి ఆగస్టు నెల కలిసి రావడం లేదు. ఆ కుటుంబానికి ఆగస్టు నెలలో తీవ్ర విషాదకర ఘటనలు ఎదురయ్యాయి. 2019 దివంగత ఎన్టీఆర్ నాల్గవ కుమారుడు అయిన హరికృష్ణ ఆగస్టులోనే కన్నుమూశారు. ఆగస్టు 29వ తేదీన నెల్లూరులో పెళ్లికి కారులో వెళ్తుండగా.. వాహనం అదుపు తప్పి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హరి కృష్ణ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే హరి కృష్ణ పెద్ద కుమారుడు, కల్యాణ్ రామ్ అన్న నందమూరి జానకి రామ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. 


టీడీపీ పార్టీకి కూడా కలిసిరాని ఆగస్టు


ఎన్టీ రామారావు కుటుంబానికే కాకుండా ఆయన స్థాపించి అధికారం సాధించిన తెలుగు దేశం పార్టీకి కూడా ఆగస్టు నెల కలిసి రాలేదు. 1984 సంవత్సరం ఆగస్టు నెలలో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేశారు. అలా ఆగస్టు నెలలో ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్ప కూలింది. తెలుగు దేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని కోల్పోగా.. ఆ రెండు ఘటనలు జరిగింది ఆగస్టులోనే కావడం గమనార్హం. అప్పటి నుండి టీడీపీ పార్టీలో ఆగస్టు నెలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఇక అప్పటి నుండి తెలుగు తమ్ముళ్లలో ఆగస్టు నెల భయం పట్టుకుంది. 1995 సంవత్సరంలో ప్రస్తుతం టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు ఆ ఏడాది ఆగస్టులోనే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతుంటారు. 


అచ్చిరాని ఆగస్టు నెల


ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు చర్చ మొదలైంది. ఆగస్టుకు ఎన్టీఆర్ కుటుంబానికి, టీడీపీ పార్టీకి అచ్చిరాలేదని అందరూ అంటున్నారు. ఎన్టీఆర్ లాంటి నాయకుడు ఆగస్టులోనే పదవి కోల్పోవడాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చిన్న కూతురు ఉమా మహేశ్వరి సైతం ఆగస్టు 1వ తేదీనే ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో... ఎన్టీఆర్ ప్యామిలీ అభిమానుల్లో పెద్ద చర్చ జరుగుతోంది.


ఉమామహేశ్వరి ఆత్మహత్య కారణాలు


ఎన్టీ రామారావు చిన్న కూతురు ఉమా మహేశ్వరి గత కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్నారు. తీవ్ర ఒత్తిడితో నిత్యం సతమతం అవుతున్నారు. పలువురు డాక్టర్లను కూడా సంప్రదించారు. యాంటీ డిప్రెషన్ మందులు కూడా వాడుతున్నారు. అదే డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.