Hyderabad Traffic Updates: హైదరాబాద్‌ నగరంలో తరచూ కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రతిసారి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తుతోంది. కొన్ని చోట్ల రోడ్లపై మోకాళ్లలోతు నీరు నిలవడంతో వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు బాగా ఇబ్బంది కలుగుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో వాహనాలు అతి నెమ్మదిగా కదులుతుండడంతో కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వర్షం సరిగ్గా పీక్ టైమింగ్స్‌లో కురవడం అదే సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం, దానికి తోడు వరద నీటి అంతరాయంతో ట్రాఫిక్ జామ్ నగరవాసులను వేధిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ట్విటర్ ద్వారా ట్రాఫిక్ సమస్యల గురించిన అప్ డేట్లు ఇస్తున్నారు.


నేడు కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) ట్రాఫిక్ జామ్ గురించి అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో పీక్ ట్రాఫిక్ (Hyderabad Traffic) ఉండే ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య భారీ వర్షం కురిసే సూచన ఉండడంతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని అలర్ట్ చేశారు. ముఖ్యంగా వాన వెలసిన ఒకటి రెండు గంటల్లోపు ట్రాఫిక్ సమస్య ఉంటుందని మంగళవారం (జూన్ 2) ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. వాహనదారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలను పరిశీలించాలని కోరారు. సోషల్ మీడియా, ఎఫ్ ఎం చానెళ్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రాఫిక్ సమస్యల గురించి తెలుసుకోవచ్చని సూచించారు. 






వర్షం వెలిసిందని అందరూ వాహనదారులు ఒకేసారి రోడ్లపైకి రావొద్దని సూచించారు.  దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుందని తెలియజేశారు. రోడ్లపై నిలిచిన నీరు ఒకటి లేదా రెండు గంటల్లో డ్రెయిన్లలోకి వెళ్లిపోతుందని, ఆ తర్వాత ట్రాఫిక్ కాస్త వేగంగా కదులుతుందని చెప్పారు. వర్షం ఆగిపోయిందని వెంటనే ప్రయాణం చేద్దామనుకుంటే అనవసరంగా ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సి వస్తుందని ప్రకటనలో హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ వివరించారు. 






ఆదివారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ వ‌ర‌కు రోడ్లపై వ‌ర్షపు నీరు నిలిచిపోయింది. ఖైర‌తాబాద్‌, పంజాగుట్ట, ల‌క్డీకాపూల్, బంజారాహిల్స్‌, మ‌ణికొండ‌, టోలిచౌకీ, జూబ్లీహిల్స్, కూక‌ట్‌ప‌ల్లి, మూసాపేట్, అమీర్‌పేట‌, స‌న‌త్ న‌గ‌ర్, బాలాన‌గ‌ర్, రాజేంద్ర న‌గ‌ర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో, వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద భారీగా వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమ‌త్తం అయ్యాయి. డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్యల్లో నిమ‌గ్నం అయ్యాయి.