BTech Student Commits Suicide For Not Getting Job: తల్లిదండ్రులు మందలించారనో, లేక కావాల్సినది దక్కలేదనో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో తమ లక్ష్యాన్ని చేరుకోలేమని భావించిన కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే, నిరుద్యోగ సమస్యతో తనువు చాలిస్తున్న వారి సంఖ్య సైతం తెలంగాణలో రోజురోజుకూ పెరిగిపోతోంది. కన్నవారికి కడుపుకోత తప్ప ఏమీ మిగలడం లేదు. ఉద్యోగం రావడం లేదని తెలంగాణలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
భద్రాద్రి విద్యార్థి ఆత్మహత్య..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పాండురంగాపురం గ్రామనికి చెందిన శ్రీనివాసరావు, శివరాణిలు దంపతులు. వీరికి కుమారుడు అజయ్(25) ఉన్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అజయ్ ఉద్యోగాల కోసం యత్నించి ఓ ప్రైవేట్ సంస్థలో చేరాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ జాబ్ మానేసి గత కొన్ని నెలలుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఉద్యోగం కోసం పదే పదే ప్రయత్నిస్తున్నా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఉద్యోగాలు సైతం కోల్పోతున్న వారు వేలల్లో ఉన్నారు. తనకు ఇక ఉద్యోగం రాదని మనస్తాపానికి లోనైన అజయ్ మార్చి నెల 20న ఆత్మహత్యాయత్నం చేశాడు.
తమ పంట పొలానికి వెళ్లిన అజయ్ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్‌ను గుర్తించిన స్థానికులు, కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు వారాలపాటు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి బీటెక్ విద్యార్థి అజయ్ చనిపోయాడు. 2 వారాలుగా చికిత్స పొందుతున్న కుమారుడు తమకు దక్కుతాడని భావించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో సోమవారం నాడు కేసు నమోదు చేసినట్లు పాల్వంచ రూరల్ ఎస్సై సుమన్ తెలిపారు.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసి నోటిఫికేషన్లు రాకపోవడంతో రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత నెలలో సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు వస్తాయని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మొదట హోం శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రూప్ 1 ఉద్యోగాలు, రెవెన్యూ శాఖలో కొన్ని పోస్టులకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. త్వరలోనే నోటిఫికేషన్లు విడులయ్యే అవకాశం ఉంది.
Also Read: Crime News: లేడీ లెక్చరర్‌తో విద్యార్థి జంప్- విచారణలో పోలీసుల మైండ్ బ్లాంక్