Bihar Purnea Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడటంతో 8 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బిహార్ పూర్ణియాలో సోమవారం ఉదయం ఈ విషాదం జరిగింది.
పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు సిలిగురి - ఢిల్లీ నేషనల్ హైవే 57పై ఒక్కసారిగా అదుపుతప్పడంతో బోల్తా పడింది. బిహార్ పూర్ణియాలోని జాలాల్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. వీరంతా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కూలీలు అని సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తుంది అనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని, డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడని స్థానికులు చెబుతున్నారు.
నిద్రమత్తులో డ్రైవింగ్..
రోడ్డు ప్రమాదంపై పూర్ణియా ఎస్‌డీపీవో సురేంద్ర కుమార్ సరోజ్ స్పందించారు. మొత్తం 16 మంది రాజస్థాన్‌కు చెందిన కూలీలు పైపుల లోడ్‌తో సిలిగురి నుంచి జమ్మూకాశ్మీర్‌కు బయలుదేరారు. కాళీ ఆలయం సమీపానికి రాగానే, పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రక్క్ అదుపుతప్పి నాలుగు లేన్ల రోడ్డుపై బోల్తా పడటంతో విషాదం చోటుచేసుకుంది. 8 మంది కూలీలు చనిపోగా, మరో 8 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భయాందోళనకు గురైన డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. డ్రైవర్‌ను ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామన్నారు.