MLC Anantha Udaya Bhaskar Arrest: మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఉదంతంలో ప్రధాన నిందుతుడైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోస్టు మార్టం రిపోర్ట్ అనంతరం ఎమ్మెల్సీపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం రాత్రి ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడం నిజమైతే ఎందుకు ప్రకటన చేయడం లేదని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు పోలీసులను నిలదీస్తున్నారు. కాకినాడ మేజిస్ట్రేట్ ఎదుట ఎమ్మెల్సీని హాజరుపరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారని సైతం వినిపిస్తోంది. పోలీసుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.


కాకినాడ హెడ్ క్వార్టర్స్‌కు తరలింపు ? 
పోలీసులు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను అదుపులోకి సీక్రెట్‌గా కాకినాడ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారని సమాచారం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి కావడంతో సోమవారం మధ్యాహ్నం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అరెస్టు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాకినాడలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. హెడ్ క్వార్టర్స్ ముందు పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తే, ఉద్రికత్తలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో పోలీసులు ఇదివరకే ఎమ్మెల్సీ సన్నిహితులను అదుపులోకి తీసుకున్నారని, తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తి మాత్రం అనంత ఉదయ్ భాస్కర్ అని స్థానికులు, సుబ్రహ్మణ్యం కుటుంబీకులు నమ్ముతున్నారు. అరెస్ట్ విషయంపై పోలీసులు గోప్యత పాటించడంపై అనుమానులు పెరిగిపోతున్నాయి.


మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్న పోలీసులు 
తొలుత మృతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం హత్య కేసుగా మార్చారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌పై హత్య కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. ఆ మేరకు సెక్షన్ 302 కిందకు మార్చారు. ఎమ్మెల్సీపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ కేసు కూడా నమోదైంది. అయితే సుబ్రహ్మణ్యం చనిపోయాక, ఎమ్మెల్సీ ఎవరికీ అందుబాటులో లేరు. కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఉన్నాడనే సమాచారంతో వెతకగా పోలీసులకు ఆచూకీ చిక్కలేదు. చివరగా ఆదివారం రాత్రి ఎమ్మెల్సీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. నేడు మేజిస్ట్రేట్ ఎదుట అనంత ఉదయ భాస్కర్‌ను హాజరు పరిచి కస్టడీకి తీసుకుంటారని తెలుస్తోంది. 


Also Read: MLC Driver Murder Case: ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ గన్‌మెన్లు సస్పెండ్, ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అరెస్ట్​


Also Read: Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య - రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే