Subrahmanyam Murder Case:: ఏపీలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ వద్ద పనిచేసే ఇద్దరు గన్‌మెన్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో మొదట సుబ్రహ్మణ్యంది అనుమానా స్పద మరణంగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, భావోద్వేగాల మధ్య కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సుబ్రహ్మణ్యంది సాధారణ మరణం కాదని, హత్య అని పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో హత్య కేసుగా మార్చారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.


డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసింది ఎమ్మెల్సీ ఉదయభాస్కరే అని అతడి కుటుంబ సభ్యులతో పాటు ఎస్సీ, ప్రజాపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చాక హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేస్తామని సెక్షన 302 కింద హత్య కేసుగా మారుస్తున్నట్టు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఎమ్మెల్సీపై హత్య కేసు నమోదు చేయడంతో పాటు ఆయన వద్ద పనిచేసే ఇద్దరు గన్‌మెన్లను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.  


పోస్టుమార్టంలో జాప్యం, ఎటూ తేల్చని పోలీసులు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోస్టుమార్టం జరపడం ఆలస్యం కావడంతో తాము విచారణ ఆలస్యంగా ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ తన కారులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని తీసుకొచ్చి కుటుంబసభ్యులకు నాలుగు రోజుల కిందట తెల్లవారుజామున అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పిన ఎమ్మెల్సీ, తాము అడిగే ప్రశ్నలకు బదులు చెప్పలేక అక్కడినుంచి వేరే కారులో వెళ్లిపోయాడని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు. అయితే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను అరెస్ట్ చేస్తేగానీ సుబ్రహ్మణ్యానికి పోస్టుమార్టం నిర్వహించకూడదని కుటుంబసభ్యులు పట్టుపట్టారు. దీంతో దాదాపు రెండు రోజుల తరువాత పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. 


పోస్టుమార్టం రిపోర్టులో తేలిన విషయాలతో ఎమ్మెల్సీపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కానీ అనంత ఉదయ భాస్కర్ ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. పుట్టినరోజు నాడు ఆయనతో పాటు ఉన్న గన్‌మెన్లు, సిబ్బంది సైతం ఎమ్మెల్సీ ఆచూకీ తెలియదని పోలీసులకు చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో వైసీపీ నేత ఇంటి వద్ద శనివారం గడిపిన ఎమ్మెల్సీ.. ఆ తర్వాత మరో ప్రాంతానికి వెళ్లారని సమాచారం. కాకినాడలోనూ కనిపించారని సమాచారం అందడంతో అక్కడ సైతం వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఎమ్మెల్సీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న అంశంపైనే అందరి దృష్టి నెలకొంది.