'హాయ్ అభి. మీకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డే గిఫ్ట్ కింద మీకు మా తరఫున ఒక గిఫ్ట్ అందిస్తున్నాం. అదేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి...'
'స్వాతంత్య్ర దినోత్సవం ఆఫర్ల కింద మీకో రూ.1,00,000 బహుమతిగా లభించింది. దీని గురించిన మరిన్ని వివరాల కోసం XYZ.com (లింక్) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.'
'హ్యాపీ ఇండిపెండెన్స్ డే (ఇందులో ఒక లింక్ ఉంటుంది). ఈ మెసేజ్‌ను 20 మందికి ఫార్వర్డ్ చేయండి. అలా చేస్తే మీ అకౌంట్‌లో రూ.200 క్రెడిట్ అవుతాయి.'
దేశమంతా పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతూ ఉంది. మన పనిలో మనముంటే.. సైబర్ నేరగాళ్లు వాళ్ల పనిలో వాళ్లు ఉంటారు. సైబర్ నేరగాళ్లకు, పంద్రాగస్టు వేడుకలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడకే వస్తున్నా.. మామూలు సమయంలో కంటే ఇలా ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఆఫర్ ట్రాప్‌లో పడిపోతాం. ఈ బలహీనతనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మలుచుకుంటున్నారు.
పైన చెప్పిన ఉదాహరణలు లాగా మీకు ఇండిపెండెన్స్ డే బహుమతి వచ్చిందనో, గిఫ్ట్ ఓచర్ వచ్చిందనే అమాయకులకు సైబర్ నేరగాళ్లు వల వేస్తుంటారు. నిజంగానే మనకు గిఫ్ట్ వచ్చిందని నమ్మి ఈ లింకులను క్లిక్ చేస్తే.. అయ్ పాయ్.. అనడమే.. మరి ఇలాంటి సమయంలో సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇలా చేసి చూడండి..
- ఆగంతకుల నుంచి వచ్చే మెయిల్స్, మెసేజ్‌లలో ఉండే లింకులను ఎట్టి పరిస్థితులలోనూ క్లిక్ చేయకండి. ముఖ్యంగా జిప్ ఫైల్స్ లేదా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ రకాలను అస్సలు తెరవకండి.
- ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్స్ మాదిరి పేర్లతోనే కొందరు బురిడీ కొట్టిస్తుంటారు. అయితే ఈ పేర్లలో ఏదోక అక్షరం తేడా ఉంటుంది. (ఉదా amazn.com, flipkrt.com). వాటిని చూడగానే నిజంగానే సదరు కంపెనీ నుంచి వచ్చిందనే భ్రమ పడతాం. కాబట్టి ఎవరి నుంచి మెయిల్ వచ్చిందనే వివరాలను ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి.
- ఈ-మెయిల్ సందేశాల్లో.. జాతీయ జెండా, మ్యాప్ ఫొటోలు యాడ్ అయి ఉన్నవి వస్తుంటాయి. వీటిని క్లిక్ చేయడం ద్వారా మన వ్యక్తిగత సమాచారం అవతలి వ్యక్తికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త అప్రమత్తతంగా ఉండండి.
- మీ జీమెయిల్ అకౌంట్‌లో టూ ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను ఇనేబుల్ చేయండి.
- సీవీవీ, బ్యాంకు ఖాతాల వివరాలు ఇతర వ్యక్తిగత (యూజర్ నేమ్, పాస్ వర్డ్) వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు.
- బహుమతులు, నగదు, కొరియర్ డెలివరీ వంటివి ఏమైనా కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఇవి చట్టబద్ధమైన సంస్థల నుంచి వస్తేనే వాటిని నమ్మండి. లేదంటే లైట్ తీసుకోవడం బెటర్.
- అవగాహన, అప్రమత్తతనే సైబర్ నేరాలకు చెక్ పెట్టగలమని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాలలో డబ్బు పోగొట్టుకున్న వారు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.