సుప్రీంకోర్టు కొలీజియంలోకి న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు చేరనున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియంలో సీనియారిటీ ప్రకారం ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్నారు. అయితే జస్టిస్‌ నారీమన్‌ రిటైర్‌ అవుతున్నారు. ఆ తర్వాత సీనియర్‌ అయిన జస్టిస్‌ నాగేశ్వరరావుకు కొలీజియంలో స్థానం లభించింది.


6 జూన్ 2022 వరకు కొలీజియంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు కొనసాగుతారు. సుప్రీంకోర్టులో ఇతర న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారాల వంటి వాటి కోసం కొలీజియం వ్యవస్థను న్యాయమూర్తులు స్వయంగా రూపొందించారు. వచ్చే వారం నాటికి సుప్రీంకోర్టులో పది న్యాయమూర్తుల స్థానాలు ఖాళీ కానున్నాయి.  సుప్రీం కోర్టు కొలీజియంలో ప్రస్తుతం ఇద్దరు తెలుగు వాళ్లు ఉన్నారు.


గుంటూరు జిల్లా పెదనందిపాడులో లావు వెంకటేశ్వర్లు, శివనాగేంద్రమ్మ దంపతుల ఐదుగురు పిల్లల్లో తొలి సంతానం నాగేశ్వరరావు. నల్లపాడులోని లయోలా స్కూలులో ఆయన ప్రాథమిక విద్య కొనసాగింది. గుంటూరులోని టీజేపీఎస్‌ కళాశాలో బీకాం డిగ్రీ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే నాటక రంగంపై ఆసక్తితో అనేక ఇంగ్లిష్‌ నాటికలు ప్రదర్శించి ప్రిన్స్‌గా పేరు పొందారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచారు. కానీ, దానిపై అంతగా ఆసక్తి లేక.. లా చదివారు. 1982నుంచి 1984 వరకూ గుంటూరు జిల్లా కోర్టులోనూ, ఆ తర్వాత 1994వరకూ హైకోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు.


లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్న సమయంలోనే.. 'ప్రతిధ్వని' సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర పోషించారు. నాటకాలు, సినిమాలే కాదు.. క్రికెట్‌ అన్నా ఆయనకు చాలా ఇష్టం. ఆ క్రీడలో గొప్ప ప్రతిభ ప్రదర్శించి క్రికెటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్ర జట్టు తరపున రంజీల్లో ఆడారు.


కొలీజియం అంటే ఏమిటి?



సుప్రీంకోర్టులో ఉన్న నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలను, ప్రధాన న్యాయమూర్తిని కలిపి కొలీజియం అంటారు. కొలీజియం సిఫారసుల మేరకు జడ్జీల నియామకం, బదిలీలు జరుగుతాయి. కొలీజియం తన సిఫారసులను ప్రభుత్వానికి పంపిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం వాటిని పరిశీలించి రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత జడ్జీలు నియమితులవుతారు.