Chinese Loan App: 



బెంగళూరులో ఘటన..


లోన్‌ యాప్స్‌ (Loan Apps) జోలికి వెళ్లకండి అని ప్రభుత్వాలు, పోలీసులు మొత్తుకుంటున్నా కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. అప్పటికప్పుడు అవసరం తీరిపోతే చాలు అనుకుని లోన్ యాప్స్‌ వలలో చిక్కుకుంటున్నారు. చివరకు పరవు పోతుందని ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ మధ్య వరుసగా ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు బెంగళూరులోనూ ఇదే తరహా సంఘటన వెలుగు చూసింది. ఓ 22 ఏళ్ల కుర్రాడు లోన్‌ యాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చైనాకు చెందిన ఓ లోన్ యాప్‌ ద్వారా లోన్ తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించలేకపోయాడు. జలహళ్లిలోని తన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. యెళహంకలోని ఓ కాలేజ్‌లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు తేజస్. లోన్ తిరిగి చెల్లించకపోతే ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయట పెడతామని ఆ యాప్‌ ఎగ్జిక్యూటివ్స్ బెదిరించారు. 


బెదిరింపులు..


మొబైల్‌లోని డేటా అంతా తన వద్ద ఉందని,అది బయట పెట్టి పరువు తీస్తానని హెచ్చరించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...తేజస్ Slice and Kiss అనే లోన్‌యాప్‌ నుంచి లోన్ తీసుకున్నాడు. అయితే...ఆ లోన్‌ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ విషయం తెలిసి తేజస్ తండ్రి డబ్బు చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. ఇన్‌స్టాల్‌మెంట్‌లలో చెల్లిస్తామని చెప్పాడు. అయినా ఆ లోన్ యాప్ ఎగ్జిక్యూటివ్స్ వేధింపులు ఆగలేదు. తేజస్ ఇంటికి వచ్చి నానా గొడవ చేశారు. మరికొంత సమయం కావాలని అడిగినా పట్టించుకోలేదు. ఆత్మహత్య చేసుకునే ముందు వరుస పెట్టి కాల్స్‌ వచ్చాయి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు తేజస్. ఆ గదిలో నుంచి సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో ఏముందంటే..


"అమ్మా నాన్న నేను చాలా పెద్ద తప్పు చేశాను. క్షమించండి. నాకు ఇంత కన్నా మార్గం దొరకడం లేదు. నా పేరిట ఇంకొన్ని లోన్స్ కూడా ఉన్నాయి. వాటిని నేను కట్టలేకపోతున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక సెలవు"


- తేజస్ సూసైడ్ నోట్ 


కట్టడి ఏది..? 


రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా లోన్ యాప్ నిర్వాహకుల తీరు మారడంలేదు. ఇచ్చిన అప్పుకు మూడింతలు వసూలు చేయడమే కాకుండా అప్పు చేసిన వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. అత్యవసరంలో అప్పు కోసం ఆన్ లైన్ లోన్ యాప్ వలలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు నిత్యం ఏదొక చోట వెలుగులోకి వస్తున్నాయి. మేం చెప్పినంత డబ్బు కట్టకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతాం, మీ బంధులకు పంపంచి మీ పరువు తీస్తామన్న బెదిరింపులతో ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు. లోన్ యాప్ లో అప్పు చేస్తే ఇక ఆత్మహత్య శరణ్యం అన్నట్లు చేస్తున్న కేటుగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎంతలా ప్రయత్నిస్తున్నా పరిష్కారాలు మాత్రం చూపలేకపోతున్నాయి. తక్కువ వడ్డీకే లోన్ అంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లోన్ యాప్ లను అదుపుచేసేందుకు మరింత కఠిన చట్టాలు చేయాలని బాధిత కుటుంబాలు అంటున్నాయి. 


Also Read: Hyderabad Crime News: ప్రియుడితో పెళ్లి కోసం కన్నబిడ్డను చంపిన తల్లి - నిద్రలో చనిపోయిందంటూ డ్రామా!