వారాహి రెండో విడత యాత్రలో వాలంటీర్ల వ్యవస్థను జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. ఆ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని కొందరు వాలంటీర్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ భగ్గుమంది. చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు అయింది.
పవన్ కల్యాణ్‌పై విజయవాడలోని కృష్ణ లంక పోలీస్‌స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశారు. అయోధ్యనగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 405/2023 కింద ఫిర్యాదు స్వీకరించి మూడు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. ఈ సురేష్‌బాబు అనే వ్యక్తి విజయవాడలోని 228 సచివాలయంలో పని చేస్తున్నాడు.
సచివాలయ ఉద్యోగి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పవన్‌పై సెక్షన్ 153, 153ఏ, 505(2) కింద కేసులు పెట్టారు. ఇందులో సెక్షన్ 153 రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని చెబుతుంది. రెండోది 153 ఏ ప్రకారం రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలు చెలరేగే ఆస్కారం ఉన్నప్పుడు పెట్టే సెక్షన్. 505(2) ప్రకారం రూమర్స్‌ను ప్రచారం చేస్తే పెట్టే కేసు. ఇలా రూమర్స్ వల్ల గొడవలు జరుగుతాయని చెప్పినప్పుడు ఈ సెక్షన్‌లో కేసు రిజిస్టర్ చేస్తారు. ఇలా మూడు సెక్షన్‌లలో కేసులు నమోదు అయ్యాయి.
వెనక్కి తగ్గని పవన్ కల్యాణ్
వాలంటీర్లు అందరూ తన సోదర సమానులనీ, అందరూ అక్కాచెల్లెళ్లు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్ల పొట్ట కొట్టాలని తాను కలలో కూడా అనుకోబోనని చెప్పారు. అవసరమైతే వారికి వచ్చే రూ.5 వేలకు ఇంకో 5 వేలు వేసి ఇచ్చే మనసున్నవాడినని అన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయయాత్ర రెండో విడతలో పాల్గొని పవన్ కల్యాణ్ మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని పవన్ ఎత్తి చూపారు.
వాలంటీర్ అంటే అర్థం.. ప్రతిఫలం ఆశించకుండా తమకు తాముగా వచ్చి సాయం చేయడం అసలు అర్థం అని అన్నారు. రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థకి దేశానికి రాష్ట్రపతి ప్రెసిడెంట్‌గా ఉంటారని, రాష్ట్రాలకు గవర్నర్‌లు బాధ్యత వహిస్తారని అన్నారు. అలాంటి ఏపీలో జగన్ వాలంటీర్ వ్యవస్థకి అధిపతి ఎవరని ప్రశ్నించారు. ఏపీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీ డేటా మొత్తం హైదరాబాద్ లోని నానక్‌రాం గూడలో ఉందని ఆరోపించారు. ఏపీకి చెందిన ప్రజల ఆధార్ డేటా మొత్తం ఓ సంస్థకు ఎందుకు అప్పగించావని నిలదీశారు. ఆ ఏజెన్సీలో పని చేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగులకు ఎవరు జీతాలు ఇస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్లు నేరాలకు పాల్పడిన ఘటనలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.
గద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా ఆడపిల్లలు!