ఇద్దరు పసివాళ్లను విధికి వదిలేసి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆకలికి తట్టుకోలేక ఒక పనివాడు చనిపోయిన విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. బెంగళూరు తిగళరపాళ్య చేతన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న శంకర్ కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లాలని ఇంటి పెద్ద కుమార్తెకు చెప్పడంతో ఈ పెనువిషాదానికి దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారతి(50), ఆమె కుమార్తెలు సించన(33), సింధురాణి(30), కుమారుడు మధుసాగర(27) ఆత్మహత్య చేసుకున్నారు.
సించనకు తొమ్మిది నెలల కుమారుడు, మూడు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. ఆకలి తట్టుకోలేక పసివాడు ప్రాణాలు విడిచాడు. ఆమె కుమార్తె ప్రేక్ష స్పృహ కోల్పోయింది. బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెండో కాన్పున కోసం పుట్టింటికి వచ్చిన సించన పండంటి మగబిడ్డ జన్మనిచ్చింది. తిరిగి అత్తింటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించనను తండ్రి శంకర్ కోరుతున్నారు. ఈ విషయంపై కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు తెలిపారు. తన మాటను ఇంట్లో ఎవరు పట్టించుకోవడంలేదని శంకర్ ఇంటి నుంచి వెళ్లి బంధువుల ఇళ్లలో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన ఆయన కిటికీ తెరిచి చూసి జరిగిన విషాదాన్ని గుర్తించారు. వీరంతా 5 రోజుల కిందటే ఉరేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: Nellore Crime: గొంతులో బఠాణీ ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి.. కంటతడి పెట్టిస్తున్న ఘటన
చిన్నారిని చిదిమేసిన తండ్రి
అన్యం పుణ్యం తెలియని రెండేళ్ల చిన్నారిని చిదిమేశాడో ఓ కసాయి తండ్రి. అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపేశాడు. హైదరాబాద్ పరిధిలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ కు చెందిన హాసిబ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం హస్రత్ బేగంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. హాసిబ్ గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యకారణాలతో ఇంట్లోనే ఉంటున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం తన కుమారుడిని హాసిబ్ హత్యచేశాడు. పెద్ద కుమారుడు ఇస్మాయిల్ (2) ను మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. అతని భార్య హస్రత్ బేగం జరిగిన ఘటనను గమనించి వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే కుమారుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.